బీజేపీ అధినాయకత్వం వరుస భేటీలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?

21 May, 2023 02:45 IST|Sakshi

గత రెండు, మూడేళ్లలో పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యతపై సీనియర్లు, పాత నేతల్లో అసంతృప్తి 

కర్ణాటకలో ఎదురుదెబ్బతో తెలంగాణపై ఆచితూచి స్పందిస్తున్న జాతీయ నాయకత్వం 

స్పష్టత కావాలంటున్న రాష్ట్ర నాయకులు 

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో సాగుతున్న సమాలోచనలపై రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో వేర్వేరుగా చర్చలు జరుపుతుండటంతో రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన పరిణామాలు ఏవైనా చోటుచేసుకోనున్నాయా? ఈ వరుస భేటీల ఆంతర్యమేంటి? ఎలాంటి రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్న దానిపై పార్టీలో చర్చలు సాగుతున్నాయి.

కర్ణాటక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ విషయంలో జాతీయ నాయకత్వం ఆచితూచి స్పందిస్తోంది. ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. రాష్ట్ర పార్టీలో సమన్వయ లేమి, నేతల్లో అసంతృప్తి, ఉమ్మడిగా ముందుకెళ్లకపోవడం, కేసీఆర్‌ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకతను సరైన పద్దతిలో బీజేపీకి అనుకూలంగా మలచకపోవడం, ముఖ్య నేతలు తమ సొంత ప్రచారానికే ప్రయత్నించడం, నాయకత్వం అందరినీ కలుపుకొనిపోవడం లేదనే విమర్శలు వంటివాటిపై కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. 

జాతీయ నాయకత్వం వద్ద నోరువిప్పుతున్న నేతలు! 
నాలుగైదు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న చర్చల్లో రాష్ట్ర నేతలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, నాయకుల వ్యవహారశైలి, ఇతర విషయాలను జాతీయ నాయకులకు వివరించినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు, విధానాలు సరిపోవని.. ఇప్పటివరకు పాటించిన పద్ధతులకు భిన్నంగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని వారు సూచించినట్టు తెలిసింది.

ఇందులో భాగంగానే నాయకత్వ మార్పు, విడిగా ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీలు ఏర్పాటు చేసి పూర్తిగా ఎన్నికల బాధ్యతలు కట్టబెట్టడం వంటి అంశాలు తెరపైకి వచ్చినట్టు సమాచారం. దీనితోపాటు తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని, ఇక్కడ హిందూత్వ ఎజెండాను పక్కనపెట్టి లౌకికవాదంతో బీసీలు, అణగారినవర్గాలకు భరోసా కల్పించేలా సాగాల్సిన  అవసరం ఉందని అభిప్రాయాన్ని వినిపించినట్టు తెలిసింది.

కేసీఆర్‌ ప్రభుత్వ నియంతృత్వ విధానాలు, వారి కుటుంబసభ్యులపై వచ్చిన అవినీతి, అక్రమాల  ఆరోపణలు, తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలు, హామీల అమల్లో వెనకడుగు వంటి అంశాల్లో బీజేపీ వైఖరిని సుస్పష్టం చేయాలని సూచించినట్టు సమాచారం. అభిప్రాయాలన్నీ తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాష్ట్ర పార్టీ చర్చనీయాంశమైంది. 

కొత్త వారికి పెద్దపీటతో అసంతృప్తి! 
గత రెండు, మూడేళ్లలో పార్టీలో చేరిన వారికి జాతీయ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న అభిప్రాయం రాష్ట్రంలోని సీనియర్లు, పాత నేతల్లో అసంతృప్తికి కారణం అవుతోంది. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరాక వారు ఏ మేరకు పార్టీకి ఉపయోగపడ్డారు, ఓటర్లను పార్టీవైపు మళ్లించేందుకు కీలకంగా వ్యవహరించారా, వారి సొంత ప్రాంతాలు, జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు, బలోపేతానికి కృషిచేశారా అన్నది కూలంకషంగా పరిశీలించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వీటన్నింటితో నిమిత్తం లేకుండానే పలువురిని ఏకంగా జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించడంతో పార్టీలో నాయకుల మధ్య అసమానతలు తలెత్తాయనే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి దాకా పార్టీ కార్యక్రమాల్లో వారిని వేదికపై కూర్చోబెట్టడం, మాట్లాడే అవకాశం ఇవ్వడం.. ఇదే సమయంలో సీనియర్లు, పాత నాయకులు కిందే కూర్చోవాల్సి రావడం అసంతృప్తిని పెంచుతోందన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఏర్పడిన స్తబ్దతను, సందిగ్ధతను దూరం చేసేలా.. జాతీయ నాయకత్వం నుంచి స్పష్టత అవసరమని నేతలు అంటున్నారు.  

>
మరిన్ని వార్తలు