సైకిల్‌ బ్రాండ్‌ పాలిట్రిక్స్‌.. టీడీపీలో రచ్చ రచ్చ..

25 Oct, 2022 12:19 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: పచ్చ పార్టీలో ఆయనో సీనియర్ నేత. లోక్ సభ సభ్యుడు కూడా. కాని ఆయన నియోజకవర్గంలో తిరగడంలేదట. కాని తనకు గౌరవం తగ్గినట్లు అనిపిస్తే మాత్రం ఏ స్థాయి నేతైనా అయినా సరే ఏకిపారేస్తున్నారట. తాజాగా ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌లో తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తిన వివాదం పార్టీల్లో రచ్చ రచ్చ అవుతోంది.

నాన్‌ స్టాప్‌ ట్రావెల్స్‌
విజయవాడ ఎంపీ కేశినేని నాని చాన్నాళ్ళుగా పార్టీ అధినేత చంద్రబాబుతో దూరం మెయింటెన్ చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలే ఆయన దూరం కావడానికి కారణమని అందరికీ తెలిసిందే. ఈ ప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కనిపిస్తోందంటున్నారు. ప్రతీ సెగ్మెంట్‌లోనూ పార్టీ ఇంఛార్జిలు వర్సెస్ క్యాడర్ అనేలా మారిపోయాయి ప్రస్తుత పరిస్థితులు. ఒంటెద్దు పోకడతో పోయేవారు కొందరైతే... ఈసారి టిక్కెట్ మాకు కావాలంటే మాకు కావాలంటూ పోటీ పడేవారు మరికొందరు. ఐతే ఇలాంటి పంచాయతీనే తిరువూరు నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య చిచ్చు రాజేసింది. పైగా ఎంపీ కేశినేని నానికి, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జి నెట్టెం రఘురామ్‌కు మధ్య గ్యాప్ వచ్చేలా చేసింది.

పక్కలో బళ్లెం
తిరువూరు నియోజకవర్గం టీడీపీకి శావల దేవదత్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి తిరువూరులోని సీనియర్ల పెత్తనానికి దేవదత్ చెక్ పెడుతూ వస్తున్నారు. ప్రత్యేకించి తనకంటూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే దేవదత్ వైఖరి నచ్చకపోయినప్పటికీ సీనియర్లు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే... అతని ఒంటెద్దు పోకడలను తప్పుపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ సామాజిక మాధ్యమం ఐటీడీపీ కార్యకర్త ఒకరు దేవదత్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేవదత్ ఎంపీ కేశినేని నాని వద్ద పంచాయతీ పెట్టారు. తన వర్గానికి చెందిన నాయకులను పక్కన పెట్టేయడంతో  కేశినేని నానికి.. దేవదత్ మీద పీకల వరకూ కోపం ఉందట. అందుకే దేవదత్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్తను తన కార్యాలయానికి పిలిపించి...దేవదత్ ఎదుటే అతన్ని సన్మానించారట కేశినేని. అంతటితో ఆగకుండా ఈసారి తిరువూరు టిక్కెట్ నీకు రాదు...ఇప్పటి వరకూ పార్టీ కోసం చేసిన ఖర్చుకి లెక్కలు చెబితే ఆ డబ్బు ఇచ్చేస్తానంటూ దేవదత్‌పై మండిపడ్డారట. ఊహించని ఈ పరిణామంతో దేవదత్ ఖంగుతిన్నారని సమాచారం.
చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట..

ఈ పరిణామం తర్వాత తిరువూరులో దేవదత్ తో పొసగని కేశినేని నాని వర్గం అంతా ఏకమయ్యారు. నియోజకవర్గ ఇంఛార్జిగా దేవదత్ తమకొద్దంటూ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం వద్ద పంచాయతీ పెట్టారట. దీనిపై నెట్టెం ఇంట్లో మాట్లాడినదంతా తెల్లారేసరికి టీడీపీ అనుకూల పత్రికల్లో వచ్చేయడంతో ఆయన షాక్ తిన్నారట. అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలను బయటికి లీక్ చేస్తే సహించబోనని.. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ నెట్టెం రఘురాం హెచ్చరించారట.

ఇప్పటికే తన వర్గానికి ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆక్రోశంలో ఉన్న కేశినేని నాని సడెన్ గా తెరపైకి వచ్చి.. నెట్టెం రఘురామ్ చేసిన ప్రకటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ ను తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. పైగా.. నిజంగా క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్ట్ రుజువులతో సహా పంపిస్తాం.. చర్యలు తీసుకుంటారా మరి అంటూ సెటైర్లు వేశారు కేశినేని నాని. నాని ఫేస్ బుక్ పోస్టు టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసిందని సమాచారం.

బాబు తెచ్చిన బాధ
అసలే పార్టీ అధినేతతో సరిగా పొసగని కేశినేని... ఇలా తనకు కోపం తెప్పిస్తే ఎవరినైనా సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరేస్తుండటంతో తెలుగు తమ్ముళ్ళు విసుక్కుంటున్నారట. పార్టీలో గొడవలుంటే సర్ధి చెప్పాల్సిన స్థాయిలో ఉన్నవారే ఇలా రచ్చకెక్కుతుంటే మా గతేంకానూ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పచ్చ పార్టీ కార్యకర్తలు.
 

మరిన్ని వార్తలు