గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి?

8 Nov, 2022 18:23 IST|Sakshi

గవర్నర్లు వర్సెస్‌ గవర్నమెంట్‌

ఎవరిది బాధ్యత, ఎవరిది అధికారం

దేశంలో గవర్నర్ల వ్యవస్థ రోజురోజుకు చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వాన్ని నడిపే వారికి, ఆయా రాష్ట్రాల గవర్నర్‌లకు మధ్య ఏర్పడుతున్న విభేదాలు మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై విద్యాశాఖకు చెందిన కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును నిలిపివేసి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్ భవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా అన్న మీమాంస సహజంగానే వస్తుంది. తమిళసై తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదించిన ఏడు బిల్లులను పెండింగ్‌లో ఉంచడం సరైన పద్దతి అనిపించదు.
చదవండి: తెలంగాణలో ఒకలా.! ఏపీలో మరోలా.! ఎందుకలా..?

ఆ బిల్లులు ఏవైనా చట్ట విరుద్దం, రాజ్యాంగ విరుద్దం అని భావిస్తే వాటిని ప్రభుత్వానికి తిప్పి పంపి, తమ అభ్యంతరాలను తెలియచేసి ఉండవచ్చు. కాని ఆమె ఆలా చేయలేదు. బిల్లుల ఆమోదం తన పరిధిలోనిది అంటూ కొత్త వాదన తీసుకు వచ్చారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఒక భాగమే తప్ప, గవర్నరే ప్రభుత్వం కాదు.  గవర్నర్ గౌరవప్రదమైన అధినేతే తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం విడుదల చేసే ఏ జిఓలో అయిన బై ఆర్డర్ ఆఫ్ గవర్నర్ అని ఉన్నంత మాత్రాన అన్ని గవర్నరే జారీ చేసినట్లుకాదు

తమిళసై కి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ బేధాభిప్రాయాలు ఇప్పుడు కొత్తరూపం దాల్చుతున్నాయి. ఇటీవలికాలంలో కేసీఆర్ కేంద్రంపైన, బీజేపీపైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ రియాక్షన్ ఈ విధంగా ఉందన్నది బహిరంగ రహస్యమే. కొన్ని నెలల క్రితం గవర్నర్ తమిళసై రాష్ట్రంలో టూర్‌లు చేస్తున్నప్పుడు ప్రభుత్వం సహకరించని మాట నిజమే. హెలికాఫ్టర్ వంటి సదుపాయం కల్పించడం మానే, కనీసం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వంటి వారు వచ్చి ఆమెకు స్వాగతం పలకడం లేదు. ప్రభుత్వం ఇలా చేయడం కూడా సరికాదు.

అలాగే కేసీఆర్ పైన, ప్రభుత్వంపైన గవర్నర్ బహిరంగ వ్యాఖ్యలకు పాల్పడడం వల్ల వివాదాలు ముదురుతున్నాయి. సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వారినే గవర్నర్లుగా నియమిస్తుంటారు. గతంలో కాంగ్రెస్ టైమ్‌లో కూడా పలువురు గవర్నర్‌లు వివాదాస్పదంగా వ్యవహరించారు. ప్రత్యేకించి ఇతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఈ వివాదాలు తీవ్రంగా ఉంటున్నాయి.

నాడు ఎన్టీఆర్‌కు షాక్‌
ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి గవర్నర్‌లు రామ్ లాల్ కాని, కుముద్ బెన్ జోషి వంటివారు కాని అనుసరించిన వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురైంది. రామ్ లాల్ అయితే ఏకంగా ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్నే రద్దు చేసి నాదెండ్ల భాస్కరరావుకు పట్టంకట్టారు. దాంతో పెద్ద ప్రజా ఉద్యమం వచ్చి, ఆనాటి ఇందిరాగాంధీనే దిగివచ్చి ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని పునరుద్దరించక తప్పలేదు. కుముద్ బెన్ జోషిపై ఆనాటి మంత్రి శ్రీనివాసులురెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించేవారు.

రాజ్‌భవన్‌ను కాంగ్రెస్ ఆఫీస్‌గా మార్చేశారన్న ఆరోపణలు వచ్చేవి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్‌లు పెద్దగా ప్రభుత్వ విధులలో జోక్యం చేసుకునేవారు కారు. ఇప్పుడు బీజేపీ హయాంలో కూడా అలాగే జరుగుతోంది. కాని వేరే పార్టీలు రాష్ట్రాలలో అధికారంలో ఉంటే మాత్రం తేడా వస్తోంది. కేంద్రంతో సఖ్యతతో ఉంటే సరే.. లేకుంటే మాత్రం తగాదానే. గతంలో యూపీలో రమేష్ బండారి అనే గవర్నర్ ఉండేవారు. ఆయన బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ అగ్రనేత వాజ్ పేయి ఢిల్లీలో నిరశన దీక్ష చేశారు.

ఇక్కడా బాబు లాబీయింగే.!
ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు తిరుగుబాటు చేసినప్పుడు ఆనాటి ఏపీ గవర్నర్ కృష్ణకాంత్ ఆయనకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఉప రాష్ట్రపతి పదవి పొందడానికి ఇది కూడా కారణమని అంటారు. తదుపరి రాష్ట్రపతి పదవి ఇస్తారని ఆయన ఆశించినా, అది జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురై మనోవేదనతో మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయన వాజ్ పేయికి మద్దతు ఇచ్చి కేంద్రానికి అనుకూలంగా మారారు. ఆ పలుకుబడితో ఆర్థికవేత్త, ఆర్బిఐ మాజీ గవర్నర్ రంగరాజన్‌ను రాష్ట్ర గవర్నర్‌గా తెచ్చుకున్నారు. ఆ టైమ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయింది.

సుదీర్ఘ కాలం నరసింహాన్‌ 
నిజానికి తెలుగుదేశం పార్టీ గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసేది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్‌లను నానా రకాలుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కేంద్రంతో రాజీ కుదుర్చుకోవడానికి మళ్లీ అదే గవర్నర్‌ను ఏదో రకంగా మేనేజ్ చేయడంలో కూడా ఆయన ఆరితేరారని చెబుతారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు టీడీపీ నేతలు విమర్శించడం కాదు.. దూషించినంత పనిచేశారు. నరసింహన్ రాజకీయవేత్తకాదు. మాజీ బ్యూరోక్రాట్. ఛత్తీస్ గడ్ నుంచి ఏపీకి బదిలిచేశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని అదుపులో పెట్టడానికి ఆయనను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నియమించిందని చెబుతుండేవారు.

ఆ టైమ్‌లో టీఆర్ఎస్ వారు ఆయనపై తెలంగాణ ద్రోహి అన్న ముద్రవేసేవారు. కాని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఆయనతో చాలా సత్సంబందాలు నెరిపారు. వారం, వారం వెళ్లి ఆయనతో భేటీ అయ్యేవారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతిభద్రతల అంశం అంతా నరసింహనే చూసుకున్నారన్న భావన ఉండేది. పోలీసు అధికారులు గవర్నర్‌కు నేరుగా రిపోర్టు చేసిన సందర్భాలు ఉన్నాయి.

కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం నరసింహన్‌కు, ఆయనకు తేడాలు వచ్చాయి. కిరణ్ సిఫారస్ చేసిన ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి నరసింహన్ నిరాకరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, కిరణ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఇలా జరిగింది. కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి.

సమన్వయం
ప్రస్తుతం ఏపీలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎలాంటి వివాదాలు లేకుండా, హుందాగా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయన పట్ల గౌరవ, మర్యాదలతో ప్రవర్తిస్తున్నారు. కాని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నించడం ఆరంభించినప్పటి నుంచి గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ క్రమంలో గవర్నర్ తమిళసైని టీఆర్ఎస్ అవమానించిందన్న భావన కూడా ఉంది. దానికి ప్రతిగా గవర్నర్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపైన, ఏకంగా సీఎంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల వరకు ఈ వివాదం ఇలాగే కొనసాగవచ్చు

ఛలో హస్తిన.!
రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఫోన్ టాపింగ్‌కు పాల్పడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆమె ఫిర్యాదు చేసి వచ్చారట. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కూడా ఆమె చర్చించారు. బీజేపీని బదనాం చేయడానికి టీఆర్ఎస్ చేస్తున్న ఎత్తుగడలను తన అధికార పరిధిలో ఉన్నమేరకు తిప్పికొట్టడానికి తమిళసై యత్నిస్తున్నారు. కేరళలో గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ అక్కడి సీపీఎం ప్రభుత్వంతో  పెద్ద గొడవే పెట్టుకున్నారు. మంత్రులను తానే తీసేస్తానంతవరకు వెళ్లారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌లను రాజీనామా చేయాలని హుకుం జారీ చేశారు.

తమిళనాడులో గవర్నర్ రవి వివాదాస్పదంగా ప్రవర్తిస్తుండడంతో డిఎంకే ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. మహారాష్ట్రలో బలం లేకపోయినా, కొంతకాలం క్రితం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ క్రియాశీలకంగా ఉండడం పెద్ద వివాదం అయింది. పశ్చిమబెంగాల్‌లో గవర్నర్ జగదీప్ ధన్‌కర్ నానా రచ్చ చేసిన ఫలితంగా ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి ప్రమోషన్ లభించింది.

పరిఢవిల్లాలి ప్రజాస్వామ్యం
మెజార్టీ తక్కువగా ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడంలో కూడా గవర్నర్ పాత్ర ఉంటోందన్న భావన ఉంది. ఇది కాంగ్రెస్ టైమ్ లోనూ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది. ఈ పరిస్థితి మారాలంటే గవర్నర్‌ల అధికార పరిధిని స్పష్టంగా నిర్వచిస్తూ కేంద్రం చట్టం చేయడమో లేక, రాజ్యాంగంలో మార్పులు చేయడమో జరగకపోతే గవర్నర్‌లకు, ముఖ్యమంత్రులకు మధ్య ఇలాగే గొడవలు సాగుతుంటాయి. కాని అధికారమే పరమావధిగా మారిన ఈ రోజుల్లో గవర్నర్ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవడానికే కేంద్రంలో ఉన్న అదికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇది ఎప్పటికైనా మారుతుందా అంటే అనుమానమే. మన ప్రజాస్వామ్యంలో గవర్నర్‌ల వ్యవస్థ ఉండడం ఒకరకంగా మేలు, మరో రకంగా కీడుగా మారింది. దీనికి పరిష్కారం ఇప్పట్లో దొరుకుందా అన్నది ప్రశ్నార్ధకమే.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు