కంటోన్మెంట్‌ కల్వకుంట్ల జాగీరు కాదు.. కేటీఆర్‌పై డీకే అరుణ ఫైర్‌

14 Mar, 2022 07:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటోన్మెంట్‌కు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేస్తామని మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీ వేదికగా రక్షణ శాఖ అధికారులను హెచ్చరించడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈ హెచ్చరికలు చేసినందుకు కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

అసలు రక్షణ శాఖ నియంత్రణలోని ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరా బంద్‌ చేయడానికి ఈ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అని నిలదీశారు. భారత్, చైనా సరిహద్దు ప్రాంతం నుంచి దేశ సైనికులు తోక ముడుచుకొని వచ్చారని, రక్షణ శాఖను గతంలో కేసీఆర్‌ హేళన చేయడం, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కశ్మీర్‌.. భారత్‌లో భాగం కాదని చేసిన వ్యాఖ్యల వెనుక అసలు రహస్యం ఏమిటని ప్రశ్నించారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నిలవడం మరచి, వారిపై అవాకులు చవాకులు మాట్లాడటం కల్వకుంట్ల కుటుంబం అహంకారానికి నిదర్శనమని డీకే అరుణ మండిపడ్డారు.

అంతుకు ముందు కేటీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆర్మీ పరిధిలో ఉన్న కంటోన్మెంట్‌ బోర్డు వ్యవహారం నగర అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. ఏఎస్‌ఐ సమీపంలోని బోర్డు ప్రాంతంలో చెక్‌డ్యాం నిర్మించారు. అక్కడ చేరుకున్న నీటితో కింద ఉన్న నదీమ్‌ కాలనీలోకి నీళ్లు వస్తున్నాయి. కంటోన్మెంట్‌ పరిధిలో రోడ్లను కూడా మూసేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సూచనలు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే కంటోన్మెంట్‌ పరిధిలో కరెంటు, నీటి సరఫరా బంద్‌ చేస్తామని అని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు