బీజేపీలో హాట్‌ టాపిక్‌.. డీకే అరుణ మౌనంపై సస్పెన్స్‌!

10 Jun, 2023 21:20 IST|Sakshi

తెలంగాణ ఫైర్ బ్రాండ్.. గద్వాల జేజమ్మ సైలంటయ్యారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మౌనంగా ఉంటున్నారు. పాలమూరుకే పరిమితమవుతున్నారు. జేజమ్మ సైలెంట్ వెనుక కారణమేంటి?. కమలం పార్టీలో ప్రాధాన్యం తగ్గిందా? లేక ఏదైనా కొత్త పదవి కోసం ఎదురుచూస్తున్నారా? డీకే అరుణ మౌనం వ్యూహత్మకమా? ఇంకేదైనా రీజన్ ఉందా?..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డీకే అరుణ.. కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన సమయంలో డీకే అరుణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో చక్రం తిప్పారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీలో చేరిన డీకే అరుణ.. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలతో పాటు.. కర్ణాటక రాష్ట్ర కో-ఇంఛార్జ్ బాధ్యతలు డీకే అరుణకు అప్పగించారు. పార్టీ లైన్ క్రాస్ కాకుండా.. తనపని తాను చేసుకుంటూపోతున్నారు. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డిని బరిలో దించి.. గెలిపించడంలో అరుణ కీలక పాత్ర పోషించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో ముందుండే డీకే అరుణ ఒక్కసారిగా సైలెంట్ కావడం ఇప్పుడు కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకే ఆమె పరిమితమవుతున్నారు. హైదరాబాద్ రాకుండా.. కేవలం సొంత జిల్లాలోనే పార్టీ పనులు చేసుకోవడం వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు కారణంగానే డీకే అరుణ సైలెంట్‌గా ఉంటున్నారా?. వ్యూహత్మకంగానే ఆమె మౌనపాత్ర పోషిస్తున్నారా? అనే విషయం అంతుచిక్కడం లేదని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.

బీజేపీ హైకమాండ్ ఢిల్లీలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు, ఇతర బాధ్యతల విషయంలో మార్పులు చేర్పులపై దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీలో కూడా కొద్దిపాటి మార్పులు జరుగుతాయనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ డీకే అరుణ సైలెంట్‌పై తెరవెనుక ఏమైనా పావులు కదుపుతున్నారా? రాష్ట్ర పార్టీ వ్యవహారాలు తనకెందుకులే అని పాలమూరు జిల్లాకే పరిమితం అయ్యారా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏదేమైనా గద్వాల జేజెమ్మ సైలెన్స్ వెనుక కారణం ఏమై ఉంటుందా అంటూ పార్టీలో తెగ చర్చించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: మల్లు రవితో జూపల్లి భేటీ.. కాంగ్రెస్‌ సీనియర్‌ ఏమన్నారంటే?

>
మరిన్ని వార్తలు