Vijayakanth: నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన..

26 Oct, 2021 07:52 IST|Sakshi

కార్యకర్తలకు డీఎండీకే అధ్యక్షులు విజయ్‌కాంత్‌ విజ్ఞప్తి 

సాక్షి, చెన్నై: అన్యుల మాటలకు మోసపోయి పార్టీకి ద్రోహం చెయొద్దు, పార్టీపై దుష్ప్రచారం చేసే వారిని నమ్మవద్దని కార్యకర్తలకు డీఎండీకే అధ్యక్షులు విజయ్‌కాంత్‌ విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి తీవ్ర ఆవేదనతో సోమవారం విడుదల చేసిన ప్రకటనలోని అంశాలు ఇలా.. ‘తమిళనాడులో మార్పు తీసుకువచ్చి, రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయాలనే ఉన్నతమై సంకల్పంతో డీఎండీకేను స్థాపించానన్న సంగతి మీకందరికీ తెలుసు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజాసంక్షేమం కోసం నా అభిమాన సంఘాలు పనిచేశాయి. అభిమాన సంఘాలు పార్టీలో విలీనమైన తరువాత నాకు అండగా నిలిచింది మీరే. అందరూ కష్టపడి బలమైన పార్టీగా తీర్చిదిద్దారు.

చదవండి: (నేరగాడిగా చిత్రీకరించే ఆ వ్యాఖ్యలు నొప్పించాయి: విజయ్‌ ఆవేదన) 

అయితే ఇప్పుడు కొందరు కార్యకర్తలు బ్రెయిన్‌వాష్‌ చేసే వారి మాటలు నమ్మి పార్టీని వీడివెళ్లడం.. నాకు మాత్రమే కాదు పార్టీకే ద్రోహం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నాను. ఇలా వీడి వెళ్లడం మీ బలహీనతను చాటుతోంది. అవకాశవాదంతో ఈ నిర్ణయం తీసుకున్నా మని మీరంతా బాధపడే రోజు వస్తుంది. నా ఆరోగ్యం క్షీణించి ఉన్న విషయం నిజమే. ఈమాత్రాన పార్టీకి భవిష్యత్‌ లేదని భావించడం సరికాదు. వందేళ్లయినా డీఎండీకేను రూపుమాపడం ఎవ్వరివల్ల కాదు.

చదవండి: (అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్‌ మద్దతు)

తమిళనాడులో ఎప్పటికీ అది వేళ్లూనుకునే ఉంటుంది. పార్టీని ప్రగతిబాటలో తీసుకు వెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృతనిశ్చయంతో ఉండాలి. పార్టీని అప్రతిష్టపాలు చేసేవారి మాటలు నమ్మవద్దు. పార్టీని వీడేలా ప్రలో భాలకు గురిచేస్తున్న వారిని ఖండించడంతోపాటూ అలాంటి వ్యక్తులను గుర్తించి ప్రధాన కార్యాలయం దృష్టికి తీసుకెళ్లండి. అందరం కలిసి బలమైన పార్టీగా ముందుకు సాగుదాం’ అని విజ్ఞప్తి చేశారు.   

మరిన్ని వార్తలు