Rajya Sabha: ఎన్నికలకు డీఎంకే పట్టు 

17 Jun, 2021 14:08 IST|Sakshi

 ఖాళీగా 3 రాజ్యసభ సీట్లు

ఎన్నికల అధికారులతో డీఎంకే బృందం భేటీ 

సాక్షి, చెన్నై : రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుల్లో ఖాళీగా ఉన్న 3 సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని డీఎంకే పట్టుబట్టే పనిలో పడింది. బుధవారం ఢిల్లీలో సంబంధిత ఎన్నికల వర్గాల్ని డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్‌ బాలు నేతృత్వంలో ఎంపీల బృందం కలిసి ఎన్నికల నిర్వహణకు పట్టుబట్టారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు 18 మంది సభ్యులు ప్రాతినిత్యం వహిస్తున్నారు. డీఎంకే సభ్యులు ఏడుగురు, అన్నాడీఎంకే సభ్యులు ఐదుగురు, తమిళ మానిల కాంగ్రెస్, పీఎంకే, ఎండీఎంకేలకు తలా ఓ సభ్యులు ఉన్నారు. మరో 3 ఖాళీగా ఉన్నాయి.  

తగ్గిన అన్నాడీఎంకే బలం 
జయలలిత హయాంలో రాజ్యసభలో అన్నాడీఎంకే సభ్యుల సంఖ్య రెండు అంకెల మేరకు ఉండేది. ఆమె మరణం అనంతరం సీఎంగా పగ్గాలు చేపట్టిన పళని స్వామి, పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌లకు రెండు పదవుల చొప్పున కేటాయించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామా, ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గడంతో మరో రెండు రాజ్యసభ సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ఇద్దరు సభ్యులు వైద్యలింగం, కేపీ మునుస్వామిలు అసెంబ్లీకి ఎన్నిక కావడంతో రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. అలాగే మరో ఎంపీ మహ్మద్‌జాన్‌ మరణంతో రాజ్యసభలో అన్నాడీఎంకే బలం తగ్గింది. 

నోటిఫికేషన్‌ విడుదల చేయాలి
ఖాళీగా ఉన్న మూడు సీట్లకు ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం ఏర్పడింది. ఈ మూడింటికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసి, ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్‌ బాలు బృందం రాజ్యసభ ఎన్నికల నిర్వహణ వ్యవహరాల్ని పర్యవేక్షిస్తున్న అధికారుల్ని కలిశారు. ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 21 నుంచి తమిళనాడులో అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయని, ఈ దృష్ట్యా, త్వరితగతిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని పట్టుబట్టారు. ఎన్నికలు జరిగితే ఆ మూడు స్థానాలు డీఎంకే డీఎంకే ఖాతాలో చేరడం లాంఛనమే. 

చదవండి: నా పదవికి ఢోకా లేదు: సీఎం

మరిన్ని వార్తలు