గవర్నర్​ను చంపడానికి ఉగ్రవాదిని పంపిస్తా: డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

14 Jan, 2023 16:58 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంతో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని గవర్నర్‌ మార్చి ప్రసంగించారు. ప్రసంగంలో బీఆర్‌ అంబేద్కర్‌, పెరియార్‌, సీఎన్‌ అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖుల పేర్లను దాటవేస్తూ కొత్త వ్యాఖ్యలను జోడించారు. ప్రసంగ పాఠంలో మార్పులను గుర్తించిన సీఎం స్టాలిన్‌.. దీనిపై అభ్యంతరం తెలియజేయగానే గవర్నర్‌ సభ నుంచి వెళ్లిపోయారు.  

అయితే ఈ వివాదం ఆరోజు నుంచి రగులుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న గవర్నర్‌ ప్రవర్తనపై తమిళనాడుతో సహా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్త వాజీ కృష్ణమూర్తి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్‌ అంబేద్కర్‌ పేరు చెప్పలేకపోతే అతను కశ్మీర్‌ వెళ్లాలని, అక్కడికి ఉగ్రవాదులను పంపుతామని, వారు  ఆయన్ను కాల్చి చంపుతారని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.

‘భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన పితామహుడు అంబేద్కర్ పేరును ఈ వ్యక్తి ఉచ్చరించడానికి నిరాకరిస్తే, ఆయనను చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా లేదా?. అసలు గవర్నర్‌ రాజ్యాంగం పేరుతో  ప్రమాణం చేయలేదా? దాన్ని రాసింది అంబేద్కర్‌ కాదా.. రాజ్యాంగం మీదనే ప్రమణం చేస్తే ప్రసంగంలోని అంబేద్కర్ పేరును ఎందుకు చదవలేదు. అంబేద్కర్‌ పేరు చెప్పకపోతే కాశ్మీర్‌కు వెళ్లిపో.. మేమే ఓ ఉగ్రవాదిని పంపిస్తాం.. వారు మిమ్మల్ని తుపాకీతో కాల్చిచంపగలరు’ అని డీఎంకే కార్యకర్త శివాజీ కృష్ణమూర్తి అన్నారు.
చదవండి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు..

మరోవైపు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గవర్నర్‌పై బెదిరింపు వ్యాఖ్యలపై రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎంకేకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గవర్నర్‌పై శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోందని చెన్నై సీపీకి రాసిన లేఖలో రాజ్ భవన్ పేర్కొంది. ఈ వీడియోలో శివాజీ కృష్ణమూర్తి గవర్నర్‌పై దుర్భాషలాడటంతో పాటు, పరువు నష్టం కలిగించే విధంగా భయపెట్టే పదజాలాన్ని ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా శివాజీ కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ఫిర్యాదును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ విభాగానికి పంపారు.

మరిన్ని వార్తలు