ఫ్యాన్‌ స్పీడ్‌కు కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ

2 May, 2021 21:33 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ఏ ఎన్నిక చూసినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. సాధారణ ఎన్నికలు మొదలుపెట్టుకుని మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్‌ గిర్రున తిరుగుతోంది. వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని శక్తిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనను మెచ్చి ఇప్పుడు అనివార్యంగా వచ్చిన తిరుపతి లోక్‌సభ ఎన్నికలోనూ ఓటర్లు వైఎస్సార్‌సీపీకి తిరిగి ఎంపీ స్థానం కట్టబెట్టారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ ఇప్పుడు ఉప ఎన్నికలోనూ సొంతం చేసుకుని హ్యాట్రిక్‌ సాధించింది. డాక్టర్‌ గురుమూర్తి తిరుపతి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందడం విశేషం. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి.

అయితే ఈ స్థానాలన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉండడం విశేషం. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రచారానికి రాకపోయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీ అభ్యర్థి గురుమూర్తి తిరుగులేని ఆధిక్యంతో దూసుకు వచ్చారు. రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యం పెంచుకుంటూ చివరకు విజయబావుటా ఎగురవేశారు.

చదవండి: సీఎం కేసీఆర్‌ సంచలనం.. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్‌
చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?'

మరిన్ని వార్తలు