-

బాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయంపై విచారణ జరపాలి

28 Mar, 2023 04:59 IST|Sakshi

నాటి వైశ్రాయ్‌ నుంచి నిన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు వరకు బాబుది ఇదే తీరు

సీబీసీఐడీ, ఈడీలు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

ఇంత డబ్బు ఎలా ప్రయాణం చేసిందో వెలికితీయాలి

శాసన మండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయంపై తక్షణమే విచారణ జరపాలని శాసన మండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు మనుషులు డబ్బులిస్తామని ఆఫర్‌ చేశారని, దానిని తాను తిరస్కరించానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ చెప్పడం, ఇది వాస్తవమేనని ఎమ్మెల్యే రామరాజు కూడా ఒప్పుకో­వడమే బాబు ‘ఓటుకు కోట్లు’ రాజకీయానికి నిదర్శనమ­న్నారు.

ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలోనూ చంద్రబాబు ఇలాంటి ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికారని, ఆయన  భ్రీఫ్‌డ్‌ మీ అనటం విన్నామని చెప్పారు. 1995లో వైశ్రాయ్‌ నుంచి నిన్నటి ఎమ్మె­­ల్యేల కొనుగోలు వరకూ బాబుది ఇదే తీరని చెప్పారు. ఈ విషయంలో సీబీసీఐడీ, ఈడీలు జోక్యం చేసు­కుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.

ఒక్కొక్క ఎమ్మె­ల్యేకి రూ.10 నుంచి 20 కోట్లు ఇస్తామన్నారని ఎమ్మెల్యేలు రాపాక, మద్దాళి గిరి కూడా చెప్పా­ర­న్నారు. వీటన్నిటిపై సీబీసీఐడీ విచారణ జరిపి, ఇంతటి దుర్మార్గా­నికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో జరిగిన ‘ఓటుకు కోట్ల’ కేసును కూడా దీనితో కలిపి విచారించాలన్నారు. ఇంత డబ్బు ఎలా ప్రయాణం చేసింతో ఈడీలాంటి సంస్థలు దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఒకే వ్యక్తి వద్ద నుంచి ప్రారంభమైందని, అన్నీ ఒకే సోర్స్‌ నుంచి జరుగుతున్నాయని అన్నారు.

శ్రీదేవి స్క్రిప్ట్‌ చంద్రబాబుదే
శ్రీదేవి అమరావతి అన్నప్పుడే ఆ స్క్రిప్ట్‌ చంద్రబాబుదని అర్ధమైందన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి  నలుగురు ఎమ్మె­ల్యేలను సస్పెండ్‌ చేసినా, శ్రీదేవి ఒక్కరే అమరావతి నినా­దాన్ని ఎందుకు ఎత్తుకున్నారని ప్రశ్నించారు. ఆమె బాగో­తాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రాణ హాని ఉందని అనడం సరైనది కాదని అన్నారు. అంత పెద్ద వారి గురించి, అంతటి పెద్ద పెద్ద మాటలు ఎందుకని అన్నారు.

సీఎం జగన్‌ నాయ­కత్వంలో దళితులంతా గౌరవంగా ఉన్నారని, ఎమ్మెల్యే శ్రీదేవిని కూడా సీఎం గౌరవంగా చూసుకున్నా­రని తెలి­పారు. శ్రీదేవికి భయం అక్కర్లేదని, ఆమె ఎక్క­డైనా స్వేచ్ఛగా తిరగొచ్చని చెప్పారు. ఆమెకు ఏం రక్షణ కావాలో ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. శ్రీదేవి రాజకీ­యాల్లోకి వచ్చినప్పటి నుంచి వివాదాలేనని, ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదని తెలిపారు. ఆమె విషయంలో వాస్తవంగా ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. ఆమె ఇలాంటి వివాదాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు