కృష్ణా జలాలపై తెలంగాణ వైఖరి సరికాదు

7 Jul, 2021 04:56 IST|Sakshi
మాట్లాడుతున్న డొక్కా మాణిక్యవరప్రసాద్, వైఎస్సార్‌సీపీ నాయకులు

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ 

బాబూ జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్సీ

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌): శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లోని కృష్ణాజలాల వినియోగంలో కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ చెప్పారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ 35వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఆయన గుంటూరులో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బచావత్‌ తీర్పులకు వ్యతిరేకంగా, కేంద్ర జలశక్తి సంఘం, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా శ్రీశైలంలో డెడ్‌స్టోరేజి నీటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం విద్యుదుత్పత్తికి వినియోగించటం తెలంగాణ ప్రభుత్వ దుందుడుకు చర్య అని విమర్శించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని, ప్రస్తుత  సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్లు పరుష పదజాలంతో దూషించటం చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. శ్రీశైలం జలాలను ముందుగా తాగు, సాగు అవసరాలకే వినియోగించాలని చట్టాలు స్పష్టంగా చెబుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం మొండితనంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయటం దుర్మార్గమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం రెండు రాష్ట్రాల్లో తమ రాజకీయ ప్రయోజనాల కోసమే చూస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ మొండివైఖరిని విడనాడాలని, చర్చల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కాకుమాను పున్నారావు, దాసరి జాన్‌బాబు, కొరిటపాటి ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు