కోట్ల, కేఈ కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు

19 Oct, 2021 08:55 IST|Sakshi

ఆలూరు నియోజకవర్గంలో కేఈ ప్రభాకర్‌ పాగా 

చంద్రబాబు వద్ద కోట్ల సుజాతమ్మ పంచాయితీ 

ఎంపీ సీటుతో పాటు ఆలూరు తమకే కావాలని పట్టు 

డోన్‌ అసెంబ్లీతో సర్దుకోవాలని అధినేత సూచన 

డోలాయమానంలో కోట్ల రాజకీయ భవితవ్యం

సాక్షి, కర్నూలు: ఎన్నికల్లో వరుస పరాజయాలను మూట కట్టుకుంటున్న తెలుగుదేశం పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. బలమైన వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనలేక కుదేలైన టీడీపీ లో తాజాగా ఆ పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్యుద్ధంతో ముసలం మొదలైంది. జిల్లా రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న కేఈ, కోట్ల కుటుంబాల మధ్య మళ్లీ ఆధిపత్యపోరు రగిలింది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు.. రెండేళ్ల క్రితం టీడీపీ వేదికగా కలిసి పని చేసినా వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో ఘోర ఓటమి ఎదురైంది. తాజాగా రాజకీయ ఉనికిలో భాగంగా ఎవరికి వారు ఆధిపత్యపోరుతో సొంత పార్టీలోనే కుంపటి రగిల్చారు. ఈ పంచాయితీ ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లడం, ఇరువర్గాలకు ఆయన చేసిన సూచనలతో ఇటు కోట్లతో పాటు కేఈ వర్గం కూడా డీలా పడింది.

ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా కోట్ల సుజాతమ్మ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల అనంతరం కూడా పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఇటీవల కేఈ ప్రభాకర్‌ ఆలూరు నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. హాలహర్వి మండలం అమృతాపురం మారెమ్మ గుడిలో మొక్కు ఉందనే కారణంతో భారీగా టీడీపీ శ్రేణులకు విందు ఇచ్చారు. ఈ   విందు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల పరిచయ వేదికగా ప్రభాకర్‌ మలుచుకున్నారు. ఆపై దేవనకొండ మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆలూరుకు పదే పదే వస్తున్నారు. ఇక్కడి టిక్కెట్‌ ఆశిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నిస్తే ‘పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా!’ అని బదులిచ్చారు. దీంతో ఆలూరు టిక్కెట్‌ ఆశావహుల జాబితాలో తాను కూడా ఉన్నానని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ తర్వాత కూడా ఈ నియోజకవర్గంలోని కీలక నేతలను పిలిపించుకుని మాట్లాడటం, వచ్చే ఎన్నికల్లో తాను ఆలూరు బరిలో ఉంటానని, అందరూ సహకరించాలని కోరుతున్నారు.
  
కోట్ల కుటుంబానికి ఒక సీటే?  
కేఈ ప్రభాకర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో సుజాతమ్మ చంద్రబాబును కలిశారు. జిల్లా రాజకీయ పరిస్థితులు వివరిస్తూ ఆలూరు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ ఆలూరులో జోక్యం చేసుకుంటున్నారని, పార్టీ తరఫున ఆయన జోక్యాన్ని అరికట్టేలా ఆదేశించాలని కోరినట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు బదులిస్తూ ‘ఆలూరు కంటే మీకు డోన్‌ బాగుంటుందని, డోన్‌ బాధ్యత మీకు అప్పగిస్తా’నని చెప్పినట్లు సమాచారం. 2004లో డోన్‌ ఎమ్మెల్యేగా గెలిచావని, నియోజకవర్గంలో పరిచయాలు కూడా ఉన్నందున డోన్‌ బాగుంటుందని సూచించినట్లు తెలిసింది.

అయితే ఎంపీగా తన భర్త కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారు కాబట్టి, ఆలూరు అయితే పార్లమెంట్‌కు కూడా కలిసొస్తుందని చెప్పినా.. చంద్రబాబు ఆమె మాటను పెడచెవిన పెట్టి డోన్‌ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆయన మాటల వెనుక వేరే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోట్ల కుటుంబానికి డోన్‌ ఇస్తే సూర్యప్రకాశ్‌రెడ్డి, సుజాతమ్మలో ఎవరు నిలబడినా పార్టీకి అభ్యంతరం లేదని, ఆ కుటుంబానికే ఒక సీటు మాత్రమే అనేది  తేటతెల్లమవుతోంది. 

కేఈ ప్రతాప్‌కు టిక్కెట్టు లేనట్టే..  
డోన్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా 2014, 2019లో కేఈ ప్రతాప్‌ పోటీ చేశారు. 2014 ఎన్నికలకు ముందు వ్యాపారవేత్తగా ఉన్న ప్రతాప్‌ ఆర్థికంగా బాగా బలపడిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి ఏర్పడి డోన్‌ టిక్కెట్‌ ఆశించారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తికి సోదరుడే కావడంతో ఆయన ప్రమేయంతో డోన్‌ టిక్కెట్‌ దక్కించుకున్నారు. అయితే రెండుసార్లు వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే 2024లో కోట్ల కుటుంబానికి డోన్‌ టిక్కెట్‌ ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉండటంతో ప్రతాప్‌కు టిక్కెట్టు దక్కనట్లేనని తెలుస్తోంది.  

నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం..  
కేఈ, కోట్ల కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాం నుంచి కోట్ల కుటుంబం కాంగ్రెస్‌లో, కేఈ కుటుంబం టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఈ క్రమంలో సూర్యప్రకాశ్‌రెడ్డి రాజకీయ ప్రత్యామ్నాయం లేక విధిలేని పరిస్థితిలో టీడీపీలో చేరారు. దీంతో కేఈ, కోట్ల కుటుంబాలు ఒకేపార్టీ వేదికగా పనిచేయాల్సి వచ్చింది. అయితే రెండేళ్లలోనే తిరిగి రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇప్పటికే జిల్లాలోని రెండు ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో ఘోర ఓటమితో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. దీనికి తోడు అన్ని మునిసిపాలిటీలు, అన్ని మండల పరిషత్‌లతో పాటు జిల్లా పరిషత్‌ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య రాజకీయ ప్రయాణం సాగిస్తోన్న తెలుగు తమ్ముళ్లకు కేఈ, కోట్ల కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆశించిన టిక్కెట్లు దక్కనపుడు రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీలో ఉంటూ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని, అవి ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గత 20 ఏళ్లలో టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పెద్ద ఫలితాలు సాధించలేదని, కర్నూలు జిల్లాలో అత్యంత బలహీనంగా టీడీపీ ఉందని, ఎవరు ఏ స్థానం ఆశించినా, ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినా ఫలితాల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు