జాతీయ పార్టీలపై కోవిడ్‌ ఎఫెక్ట్‌.. భారీగా తగ్గిన విరాళాలు

14 Jul, 2022 20:18 IST|Sakshi

ఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసమంటూ విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని అనేక రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ ప్రభావం రాజకీయ పార్టీలపైనా పడింది. కోవిడ్‌ సమయంలో జాతీయ పార్టీలకు అందిన విరాళాలు దాదాపుగా సగం మేర తగ్గిపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని గుర్తింపు పొందిన జాతీయ పార్టీల విరాళాలు రూ.420 కోట్ల మేర తగ్గిపోయినట్లు అసోసియేషన్ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆ విలువ 41.49 శాతం తక్కువగా పేర్కొంది. 

బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్లు విరాళాలు రాగా.. 2020-21లో 39.23 శాతం తగ్గి రూ.477.54కోట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి 2019-20లో రూ.139.01 కోట్లు విరాళాలు రాగా.. 2020-21లో 46.39శాతం తగ్గి రూ.74.52 కోట్లు మాత్రమే అందాయి. అత్యధికంగా ఢిల్లీ నుంచి జాతీయ పార్టీలకు రూ.246 కోట్లు విరాళంగా వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రూ.71.68 కోట్లు, గుజరాత్‌ నుంచి రూ.47 కోట్లు అందాయి.  బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలు.. విరాళాల్లో 80 శాతాన్ని ఆక్రమించగా.. మిగిలిన 20 శాతం చిన్న పార్టీలకు అందాయి. 

ఏడీఆర్‌ నివేదిక ప్రకారం రూ.480 కోట్లు కార్పొరేట్‌, బిజినెస్‌ రంగాల నుంచి వచ్చాయి. మరోవైపు.. రూ.111 కోట్లు విరాళాలు 2,258 మంది వ్యక్తులు అందించారు. సుమారు రూ.37 కోట్ల విరాళాలకు సరైన ఆధారాలు లేకపోవటం వల్ల ఏ రాష్ట్రం నుంచి వచ్చాయనే వివరాలు వెల్లడికాలేదు. బీజేపీకి మొత్తం 1,100 విరాళాలు కార్పొరేట్‌, బిజినెస్‌ సెక్టార్ల నుంచి వచ్చాయి. కాంగ్రెస్‌కు 146 విరాళాలు వచ్చాయి. 

ఇదీ చూడండి: ఓపీఎస్‌కు మరో షాకిచ్చిన ఈపీఎస్‌.. 18 మంది బహిష్కరణ

>
మరిన్ని వార్తలు