ఓటు అమ్ముకోవద్దు.. డబ్బులిస్తే తీసుకోండి: వైఎస్‌ షర్మిల

14 Aug, 2022 02:36 IST|Sakshi

మద్దూరు/దౌల్తాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు పేరిట రూ.5 వేలిచ్చి.. రూ.30 వేల వరకు వచ్చే సబ్సిడీ పథకాలను బంద్‌ పెట్టారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర శనివారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోకి ప్రవేశించింది. అంతకుముందు వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ నుంచి ప్రారంభమైన ప్రజాప్రస్థానం యాత్ర గోకఫసల్‌వాద్, దేవర్‌ఫసల్‌వాద్‌ మీదుగా మద్దూరు వరకు సాగింది.

దమ్‌గాన్‌పూర్‌ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మాట– ముచ్చట కార్యక్రమంలో ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవన్నారు. తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా కేసీఆర్‌లో చలనం లేదన్నారు. ‘ఈసారి మాత్రం ఆలోచించి ఓటెయ్యండి. ఓటును మాత్రం అమ్ముకోవద్దు. డబ్బులిస్తే తీసుకోండి. ప్రాజెక్టుల పేరుమీద దోచుకున్న మీడబ్బులే అవి. వైఎస్సార్‌ బిడ్డగా మాటిస్తున్నా.. వైఎస్సార్‌ సంక్షేమ పథకాలన్నీ అమలుచేస్తా. నా మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదనే’ అని చెప్పారు.
చదవండి: బీజేపీ, కాంగ్రెస్‌ దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి?

మరిన్ని వార్తలు