సీఎం మమతా బెనర్జీలో అనూహ్య మార్పు.. మోదీకి మద్దతుగా కామెంట్స్

19 Sep, 2022 20:54 IST|Sakshi

కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీపై వీలుచిక్కినప్పుడల్లా విమర్శలు, కుదిరితే సెటైర్లు వేస్తుంటారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధమే నడిచింది. అయితే ఇప్పుడు మమతలో అనూహ్య మార్పు వచ్చింది. బెంగాల్ అసెంబ్లీలో మోదీకి మద్దతుగా ఆమె మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బెంగాల్ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మమత.. సీబీఐ, ఈడీకి బయపడి దేశంలోని వ్యాపారస్థులు విదేశాలకు పారిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే దీనికి మోదీ కారణం కాదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. సీబీఐ హోంశాఖ పరిధిలోకి వస్తుందని, ప్రధాని కార్యాలయానికి దీనితో సంబంధం లేదని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తరచూ హోంమంత్రిని కలిసి తమపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎప్పుడూ మోదీపై విమర్శలు గుప్పించే మమత.. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడటం సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

కుతంత్రం..
అయితే మమత వ్యాఖ్యలపై బీజేపీ నేత సువేంధు అధికారి స్పందించారు. బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకునేందుకే ఆమె ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మమత కుతంత్రాలను బీజేపీ ఆ మాత్రం పసిగట్టలేదా అని సెటైర్లు వేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు సీఎం మమతా బెనర్జీ. అయితే ఈ చర్యను బీజేపీ తప్పుబట్టింది. తర్వాత న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఇలాగే తీర్మానాన్ని తీసుకొస్తారా? అని ప్రశ్నించింది.
చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్‌! సోనియాతో కీలక భేటీ

మరిన్ని వార్తలు