దుబ్బాక పోలింగ్‌  82.61%

4 Nov, 2020 02:06 IST|Sakshi
చిట్టాపూర్‌లో ఓటు వేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత, బొప్పాపూర్‌లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు, తుక్కాపూర్‌లో ఓటు వేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

2018తో పోల్చితే 3.63% తక్కువ

ప్రశాంతంగా ముగిసిన ఉపఎన్నిక

కాంగ్రెస్‌ అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు సోషల్‌ మీడియాలో వదంతులు

వెంటనే ఖండించిన శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. 82.61% పోలింగ్‌ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 1,98,807 ఓటర్లు ఉండగా.. ఇందులో 1,64,192 మంది (82.61%) తమ ఓటు హక్కును విని యోగిం చుకున్నారు. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 1,90,463 మంది ఓటర్లు ఉండగా 1,64,280 మంది (86.24%) తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.63% పోలింగ్‌ తగ్గింది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ లన్నీ దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. ప్రతీ ఓటు కీలకంగా భావించాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ శాతం పెరుగుతుందని అం దరూ భావించారు. కానీ కోవిడ్‌ నేపథ్యంలో గతం కన్నా పోలింగ్‌ శాతం తగ్గిందని అధి కారులు చెబుతున్నారు. ఇది ఎవరికి నష్టమనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. రాజకీయంగా ఉద్రిక్తతలకు తావిచ్చిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో పోలీసు సిబ్బంది, అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు
చిన్న చిన్న సంఘటనలు మినహా నియోజకవర్గమంతటా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినట్లు పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. 
–దౌల్తాబాద్‌ మండలం ఇందూప్రియాల్, శేరుపల్లి బంధారం, తొగుట మండలం పెద్దమాసాన్‌ పల్లి, ఇందిరానగర్‌లలో పోలీసులకు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. 
–రాయపోల్‌ మండలం మంతూర్, బేగంపేట, దుబ్బాక రూరల్‌ మండలం బొప్పాపూర్, రామక్కపేట, చేగుంట మండలం కర్నాలపల్లి పోలింగ్‌ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత చిట్టాపూర్‌లో, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బొప్పాపూర్‌లో ఓటు వేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తొగుట మండలం తుక్కాపూర్‌లో ఓటు చేశారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ సరళి, ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) శశాంక్‌ గోయల్‌ పరిశీలించారు. దుబ్బాక ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను, తర్వాత చేగుంట మండలం వడియారం పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో, ఏపీవో, ఇతర పోలింగ్‌ సిబ్బందితో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. కోవిడ్‌ నిబంధనల అమలు, శాంతి భద్రతలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ భారతి హోళికేరి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ జిల్లాలోని పోలింగ్‌ తీరుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. 

కాంగ్రెస్‌ అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరాడని ప్రచారం
పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరాడని సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారం తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల మద్దతు తనకే ఉందని గ్రహించిన ప్రత్యర్థి పార్టీలు కుట్ర చేసి సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తన ప్రతిష్టకు భంగం కల్గించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు