దుబ్బాక బీజేపీలో ముసలం

7 Oct, 2020 14:48 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక బీజేపీలో ముసలం ఏర్పడింది. పార్టీ అభ్యర్థిగా మాధవనేని రఘునందర్‌రావును ఖరారు చేయడంపై స్థానిక బీజేపీ నేత తోట కమలాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన్‌రావు లాంటి వ్యక్తికి పార్టీ టికెట్‌ ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీ అధిష్తానం పునరాలోచించాలని కమలాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించారు. మరోవైపు తోట కమలాకర్‌రెడ్డిని పార్టీ నుంచి బీజేపీ తొలగిస్తూ ప్రకటన చేసింది. (దుబ్బాక... మనకు కీలకం )

ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే  రఘునందన్‌రావుకే టికెట్‌ దక్కింది. గతంలో ఆయన దుబ్బాక నుంచి రెండు పర్యాయాలు బీజేపీ తరఫున పోటీ చేశారు. అలాగే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బరిలో ఉన్నారు. ​కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీమంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తెరమీదకు వచ్చింది. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.(దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత)

నవంబర్‌ 3న ఉప ఎన్నిక
దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనుంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్‌ 9న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును విధించారు. నవంబర్‌ 10న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. (కాంగ్రెస్‌ గూటికి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి) 

 పోటీకి దూరంగా సీపీఐ
ఉప ఎన్నికకు సీపీఐ పోటీకి దూరంగా ఉండనుంది. పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాల్లో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయన్నారు. రెండ్రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.

షెడ్యూల్‌ వివరాలు..
నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 
నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 
ఉపసంహరణ చివరి తేదీ:  అక్టోబర్ 19 
పోలింగ్ తేదీ : నవంబర్ 3 
కౌంటింగ్ తేదీ నవంబర్:  10

మరిన్ని వార్తలు