బీజేపీని 300 ఫీట్ల లోతులో పాతి పెట్టాలి 

29 Oct, 2020 08:34 IST|Sakshi
మెదక్‌ జిల్లా చేగుంటలో కేంద్రం పంపిన రైతు బిల్లు లేఖల ప్రతులను చూపుతున్న హరీశ్‌

కాంగ్రెస్, బీజేపీలతో ఎలాంటి అభివృద్ధి జరగదు: హరీశ్‌రావు 

వారి ప్రచారంలో పరాయి నేతలు.. కిరాయి జనాలు..

సాక్షి, మెదక్‌: బాయి కాడ మీటర్ల పేరుతో కేంద్రం బిల్లు తెచ్చిందని.. బోర్ల వద్ద మీటర్లు వద్దనే రైతులు.. బీజేపీని 300 ఫీట్ల లోతులో పాతి పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ జిల్లా చేగుంటలో రోడ్‌షో, రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో కాలిపోయే మోటార్లు, పైసలు ఉంటేనే ట్రాన్స్‌ఫార్మర్లు వచ్చేవని, బీజేపీ ప్రభుత్వం ఏకంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు చట్టం తీసుకొచ్చిందన్నారు.

ఏప్రిల్‌ 27న కేంద్ర ప్రభుత్వం ఉచిత కరెంటు, సబ్సిడీ కరెంటు ఇవ్వొద్దని, వ్యవసాయ మీటర్లు పెడితే రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్రం మే 17న లేఖ రాసిందన్నారు. అయినప్పటికీ.. రైతులకు ఉచిత కరెంటు అందిస్తామని కేంద్రానికి సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారన్నారు. కాళేశ్వరం నీళ్లు దుబ్బాక వరకు వచ్చాయని.. త్వరలోనే చేగుంట, శంకరంపేట మీదుగా మెదక్‌ వరకు అందిస్తామన్నారు. మార్కెట్‌ కమిటీలను ప్రైవేట్‌ పరం చేస్తే రైతులు ఆగమవుతారని మంత్రి తెలిపారు. వ్యవసాయాన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేయమంటే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. 

తోకముడిచిన బీజేపీ నేతలు  
టీఆర్‌ఎస్‌ మాత్రం బీడీ కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేల పింఛన్‌ అందిస్తోందని చెప్పారు. కేంద్రం దేనికోసం నిధులు ఇచ్చిందో నిరూపించమంటే బీజేపీ నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచారంలో పరాయి నాయకులు, కిరాయి జనాలే కనిపిస్తున్నారని విమర్శించారు. దుబ్బాకలో సుజాతక్కను గెలిపిస్తే మనకు సీఎం నిధులు ఇస్తారన్నారు.

వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ 
సాక్షి, సిద్దిపేట: కరోనా భయం నేపథ్యంలో దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వృద్ధులు, దివ్యాంగులకోసం భారత ఎన్నికల సంఘం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. గతంలో ఎన్నికల డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు కల్పించిన పోస్టల్‌ బ్యాలెట్‌ మాదిరిగానే.. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేమని ముందుగా తెలిపిన వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు ఇచ్చి ఓటు వేసిన తర్వాత సీల్డ్‌ కవర్లను స్వీకరిస్తున్నారు. కాగా, ‘నవంబర్‌ మూడో తేదీన ఎన్నికలు ఉండగా.. పోలింగ్‌కు ముందే ఈ పోలింగ్‌ ఏంది.. ఎవరికీ సమాచారం లేకుండా ఎలా ఓట్లు వేయిస్తున్నారు’అని పలువురు నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. నార్సింగి మండల కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌లను స్వీకరిస్తున్న అధికారులను ఇలానే వెనక్కి పంపించారు. అయితే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు సేకరిస్తున్నామని, ఈ విషయం రిటర్నింగ్‌ అధికారి  నిర్వహించిన అన్ని పార్టీల సమావేశంలో వివరించామని అధికారులు చెబుతున్నారు.  

1,553 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు అంగీకారం
దుబ్బాక నియోజకవర్గంలో 1,084 మంది వృద్ధులు, 469 మంది దివ్యాంగులు మొత్తం 1,553 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. వంద మంది ఓటర్లకు ఒక బృందం చొప్పున మొత్తం 15 టీమ్‌లను ఎంపిక చేశారు. 15 బ్యాలెట్‌ బాక్స్‌లు వీరికి అందజేశారు. ఇద్దరు ఎన్నికల నిర్వహణ ఉద్యోగులు, ఇద్దరు పోలీసులు కలిసి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసిన వారినుంచి సీల్డ్‌ కవర్‌ను సేకరిస్తున్నారు.
 
సమాచారం లేదని అడ్డుకున్న యువకులు
చెప్పాపెట్టకుండా బ్యాలెట్‌ బాక్సులతో వచ్చి ఓట్లు వేయించుకుంటున్నారని బీజేపీతోపాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు యువకులు, నాయకులు బ్యాలెట్‌ బాక్సులతో వచ్చిన అధికారులను వెనక్కి పంపిన సంఘటన మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రిటర్నింగ్‌ అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్యామల బృందం నార్సింగి మండల కేంద్రంలోని గుర్రాల చంద్రయ్య ఇంటికి వెళ్లింది. 80 సంవత్సరాలకు పైబడిన ఆయన తల్లికి ఇచ్చిన బ్యాలెట్‌ పేపర్‌ను తీసుకుంటుండగా.. అక్కడికి వచ్చిన పలువురు యువకులు.. ఎవరికీ చెప్పకుండా వచ్చారు. ఎన్నికలకు ముందు ఈ ఓటింగ్‌ ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా అక్కడి నుంచి పంపించారు.
 
రాజకీయ పార్టీల సమావేశంలోవివరించాం
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోవిడ్‌ నేపథ్యంలో 80 సంవత్సరాలకు పైబడిన వారికి, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాం. పోలింగ్‌ స్టేషన్‌కు రాలేమని ముందుగా చెప్పిన వారికి బ్యాలెట్‌ పత్రాలను అందజేశాం. ఈ విషయం రాజకీయ పార్టీల సమావేశంలో కూడా చెప్పాం. గ్రామాల్లోకి వచ్చే పోలింగ్‌ అధికారులకు సహకరించాలి. సీల్డ్‌ కవర్లలోనే బ్యాలెట్‌ పత్రాన్ని స్వీకరించి సిబ్బంది బాక్స్‌లలో వేస్తున్నారు.
– చెన్నయ్య,  రిటర్నింగ్‌ అధికారి  

>
మరిన్ని వార్తలు