దుబ్బాక ఉప ఎన్నిక‌: ఎవరి ధీమా వారిదే

31 Oct, 2020 08:45 IST|Sakshi
సోలిపేట సుజాత (టీఆర్‌ఎస్‌), శ్రీనివాస్‌రెడ్డి ( కాంగ్రెస్‌), రఘునందన్‌ రావు (బీజేపీ)

దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విశ్వాసం 

మేమే గెలుస్తాం.. ప్రస్తుతం దుబ్బాకలో ప్రధాన పార్టీల నాయకుల నోట ఇదే మాట. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. రామలింగారెడ్డి చేసిన సేవలు తన విజయానికి సోపానాలని, అధిక మెజార్టీతో విజయం సాధిస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, బీజేపీపై సానుకూలత నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవంగా వ్యాప్తి చెందుతోందని, ఈసారి విజయం బీజేపీదేనని ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటున్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంలోనే అంటూ తమ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉందని, టీఆర్‌ఎస్, బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుంటూ.. గెలుపుపై అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,90,483 ఓట్లు ఉండగా.. 1,63,658 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి 89,112 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డికి 26,691, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 22,595 ఓట్లు వచ్చాయి.  
– సాక్షి, సిద్దిపేట 

భారీ మెజార్టీ సాధిస్తాం 
ప్రజలకు టీఆర్‌ఎస్‌పై నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను. దుబ్బాక ప్రాంతం అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. తాగునీరు, సాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో నా భర్త ప్రజల దాహార్తిని తీర్చారు. గోదావరి జలాల తరలింపుతో సాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటి తలుపు తట్టాయి. ప్రజల కష్టాలు తీర్చిన పార్టీగా టీఆర్‌ఎస్‌ వెంట ప్రజలు ఉన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నా. రామలింగారెడ్డి  చేసిన  సేవలు చూసి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు.

 – సోలిపేట సుజాత (టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని) 

ఓటు బ్యాంకు ఉంది
నియోజకవర్గంలో మా తండ్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి కళ్ల ముందు కన్పిస్తోంది. నాడు వెంట ఉండి నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి పంపించిన ప్రజలు ఇప్పుడు ఆయన వారసుడిగా.. నన్ను ఆదరిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌ అంటే ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నుంచి ఇప్పటి వరకు మా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా దుబ్బాకలో ఉండి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇలా ప్రతీ అంశం మా విజయానికి దోహద పడుతుంది.  
– చెరుకు శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌ అభ్యర్థి) 

మార్పు ఖాయం
అబద్ధాలకోరు టీఆర్‌ఎస్‌తో విసిగి పోయిన దుబ్బాక ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఈ విప్లవమే బీజేపీ విజయానికి సోపానం అవుతుంది. రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో దుబ్బాక ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. కానీ రాష్ట్ర ఫలాలు మాత్రం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు అందుతున్నాయి. ఆ మూడు నియోజకవర్గాలను చూసిన వారెవ్వరూ దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయరు. దుబ్బాక నియోజకవర్గంలో 99 శాతం పల్లెలు ఉన్నాయి. పల్లెల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విరివిరిగా నిధులు ఇస్తుంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ చరిష్మా సిద్దిపేటలో కూడా పనిచేస్తుంది. గెలిచినా..? ఓడినా..? దుబ్బాక ప్రజల మధ్యనే ఉన్నా..? ఈ సారి దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. నా విజయం దాదాపు ఖాయమైంది.
– రఘునందన్‌రావు (బీజేపీ అభ్యర్థి)

మరిన్ని వార్తలు