29న దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూలు..?

26 Sep, 2020 07:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక షెడ్యూలు ఈ నెల 29న వెలువడే అవకాశం ఉంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు శుక్రవారం వెలువడగా, దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూలును కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని భావించారు. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఒక లోక్‌సభ స్థానంతో పాటు, మరో 64 శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అయితే పోలింగ్‌ సమయంపై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ నెల 29న సమీక్ష నిర్వహించి ఉప ఎన్నిక షెడ్యూలు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక షెడ్యూలుపై 29న స్పష్టత రానున్నది. 

దుబ్బాకలో మోహరించిన టీఆర్‌ఎస్‌ బలగాలు 
దుబ్బాక ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయిలో ఇప్పటికే పార్టీ యంత్రాంగాన్ని మోహరించింది. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో పాటు, ఉపఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు. మండల స్థాయిలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమించి గ్రామాల వారీగా పార్టీ కేడర్‌ను కూడగడుతున్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్‌ కేటాయిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతుండగా, మాజీ మంత్రి ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. షెడ్యూలు వెలువడిన తర్వాత పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలనే యోచనలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉంది.

నిజామాబాద్‌లో భారీ ఆధిక్యంపై కన్ను 
నిజామాబాద్‌ శాసన మండలి స్థానిక సంస్థల కోటా స్థానానికి వచ్చేనెల 9న పోలింగ్‌ జరగనుండటంతో..పోలింగ్‌ నాటికి మరింత మంది ఓటర్ల బలం కూడగట్టుకుని భారీ ఆధిక్యం సాధించాలని టీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

మరిన్ని వార్తలు