దుబ్బాక... మనకు కీలకం 

5 Oct, 2020 04:52 IST|Sakshi

త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తాం 

దుబ్బాక ఉపఎన్నికపై సమీక్షలో రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి చాలా ముఖ్యమని, ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ పేర్కొన్నారు. నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, వారికి కేటాయించిన గ్రామాల్లోనే ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉండి పనిచేయాలని సూచించారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ అధ్యక్షతన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నవంబర్‌ 3న జరిగే దుబ్బాక ఉపఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై గంటకు పైగా చర్చించారు. అనంతరం మాణిక్యం ఠాగూర్‌ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని ఏఐసీసీ త్వరలోనే ప్రకటిస్తుందని చెప్పారు.  

సీఎంను కలుస్తారు... మాకేమో అనుమతి ఇవ్వరా? 
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాంగ్రెస్‌ నాయకులను కలవొద్దని రాష్ట్ర గవర్నర్‌ కూడా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలుస్తామని చెప్పినా కరోనా పేరుతో అనుమతించలేదని, కానీ సీఎం కేసీఆర్‌కు మాత్రం కరోనా నిబంధనలు అడ్డురాలేదని విమర్శించారు. గవర్నర్, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని దీన్ని బట్టి అర్థమవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీవ్ర ఉద్యమాలు చేయాలని ఆయన కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఎ.రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.  

నేడు సత్యాగ్రహ దీక్షలు: ఉత్తమ్‌ 
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని, అందరికీ బాధ్యతలు అప్పగిస్తామని, ఎవరి బాధ్యతలను వారు సజావుగా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. హాథ్రస్‌లో దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో బాధితురాలికి న్యాయం జరిగే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని, ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్షలు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు.

గాంధీభవన్‌ ఎదుట మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు ఓటరు నమోదులో క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చురుగ్గా కొనసాగించాలన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.   

మరిన్ని వార్తలు