దుబ్బాకలో దుమ్ము రేపేదెవరు?

5 Feb, 2023 17:38 IST|Sakshi

2020 ఆఖరులో జరిగిన ఉప ఎన్నికతో దుబ్బాక నియోజకవర్గం పేరు రాష్ట్రం అంతా తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీఆర్ఎస్ కంచుకోటగా ఉండేది. కాని ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయంతో పెద్ద సంచలనమే కలిగింది.

అప్పటి వరకు కారు స్పీడ్‌కు ఎక్కడా బ్రేకులు పడలేదు. ప్రతి ఉప ఎన్నికలోనూ గెలిచింది. కాని దుబ్బాకలో సిట్టింగ్ సీటును గులాబీ పార్టీ కమలం పార్టీకి వదిలేసుకుంది. బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం.

ఉప ఎన్నికతో మారిన రాజకీయ చిత్రం
తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. అప్పటివరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న రాష్ట్ర రాజకీయాలు కారు వర్సెస్ కమలంగా రూపాంతరం చెందాయి. 2020లో చివర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును బీజేపీ గెలుచుకుంది. ఈ గెలుపుతో కారు పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చాటుకునే అవకాశం లభించింది.

అంతకుముందు రెండు సార్లు ఓటమి చెందిన రఘునందనరావు స్వల్ప మెజారిటీతోనే అయినా సంచలన విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు చెరకు ముత్యం రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాల చేతిలోనే దుబ్బాక నియోజకవర్గం కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ప్రత్యేక రాష్ట్ర పార్టీగా ఉనికిలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పాగా వేసింది.

చెరకు ముత్యం రెడ్డి ప్లేస్లో 2004లో సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. 2009లో మళ్ళీ చెరకు ముత్యం రెడ్డి గెలిచినా..ఆ తర్వాత రెండుసార్లు గులాబీ పార్టీ తరపున సోలిపేట గెలిచారు. 2020లో సోలిపేట అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఉపఎన్నిక జరిగి దుబ్బాక రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చింది.

జైత్రయాత్రలకు బ్రేక్‌
చెరకు, సోలిపేట కుటుంబాల జైత్రయాత్రకు బ్రేక్ వేసి.. కాంగ్రెస్, కారు పార్టీలను పక్కకు నెట్టి ఉప ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థి రఘునందనరావు విజయం సాధించారు. ఇక సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో..మూడు ప్రధాన పార్టీల నేతలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఎవరికి వారే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు... రామలింగారెడ్డి సతీమణి పై స్వల్ప మెజారిటీతోనే  గెలిచారు.

అందువల్ల చే  జారిపోయిన సీటును తిరిగి గులాబీ పార్టీ ఖాతాలో వేసుకోవడం కోసం తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుండి బరిలో దింపాలని గులాబీ పార్టీ బాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభాకరరెడ్డి కూడా దుబ్బాక సొంత నియోజకవర్గం కావడంతో..ఎంపీగా కంటే..ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు.

జనంతోనే జనం వెంటే
బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు నియోజకవర్గంలోనే క్యాంప్ వేసి పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో మమేకమవుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాదులో ఉంటున్నప్పటికీ ఉదయం లేవగానే దుబ్బాకలో కనిపిస్తున్నారు. వారానికి 5 రోజులపాటు ఆయన  నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.

కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి సైతం ప్రజల మధ్యే ఉంటున్నారు. మొత్తానికి ముగ్గురు నేతలు నియోజకవర్గంలోనే తిరుగుతూ..తమ పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి.. ఎమ్మెల్యే రఘునందన్ రావుకి తరుచు డైలాగ్ వార్  నడుస్తోంది. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రోటోకాల్ గొడవ ఎవరికి న్యాయం చేస్తుందో చూడాలి.

తండ్రి సీటుపై తనయుడి ఆశ
దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సీటుపై ఆశ పడుతున్నట్టు సమాచారం. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు బై ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు అమలుకాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సరైన ప్యాకేజీ ఇప్పిస్తానని చెప్పడం.. రైతులకు రెండు ఎడ్లు, నాగలి ఇస్తానంటూ చెప్పిన హామీలేవీ నెరవేరలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి బై ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోయారు.

మరి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రచారాయుధంతో ప్రజల ముందుకు వస్తారా అని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ నుండి మరో నేత డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆఖ లో మాత్రం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికే దుబ్బాక టికెట్ ఓకే అయినట్లు పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అందుకే వారంలో ఐదు రోజులపాటు దుబ్బాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని చెప్పుకొంటున్నారు. గులాబీ పార్టీలో మరో నేత బీసీ సామాజిక వర్గంకు చెందిన చిందెం రాజకుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.
చదవండి: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..?

ఉప ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నెగ్గిన మాటల మాంత్రికుడు కమలం పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో కూడా మంచి  మెజారిటీతో విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కొనసాగుతున్న తమ జైత్ర యాత్రకు బ్రేక్ వేసిన రఘునందన్ను వచ్చే ఎన్నికల్లో ఓడించి మళ్ళీ సత్తా చాటాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని   నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు  శ్రీనివాసరెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. త్రిముఖ పోటీలో దుబ్బాకలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.  
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు