ఒక ఎన్నిక.. అనేక సంకేతాలు!

12 Nov, 2020 07:20 IST|Sakshi

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం

సానుభూతి కోణాన్ని మార్చేసి మరీ రాజకీయ పక్షాలకు సవాల్‌ విసిరిన వైనం

అధికార పార్టీకి షాకిచ్చి అప్రమత్తం చేసిన హోరాహోరీ పోరు

ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేందుకు ఉత్సాహం పొందిన బీజేపీ

పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్‌ భవిష్యత్తు ఎలా ఉంటుందో తేల్చి చెప్పిన ఓటరన్న

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌కు షాకివ్వడమే కాక, ఈ ఎన్నిక రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయ ముఖచిత్రానికి సంబంధించిన అనేక సంకేతాలను వెలుగులోకి తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఎదుర్కొన్న ఈ ఎన్నికలో అంతిమ విజేత ఎవరైనా మూడు పార్టీల భవిష్యత్తును నిర్దేశించేలా దుబ్బాక ప్రజలు తీర్పునిచ్చారని, మూడు పార్టీలనూ ఆలోచనలో పడేసేలా ఫలితం వచ్చిందని రాజకీయ వర్గాలంటున్నాయి. సానుభూతి కోణంలోనే పోరాడిన మూడు పక్షాల హోరాహోరీ పోరు  రాజ కీయ పక్షాలకు సవాల్‌ విసిరేలా, ప్రచారంలో దూకుడు, భావోద్వేగాలకు వేదికగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

టీఆర్‌ఎస్‌: అప్రమత్తం
గత ఆరేళ్లుగా జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన అధికార టీఆర్‌ఎస్‌కు ఈ ఓటమి మేల్కొలుపు వంటిదని రాజకీయ వర్గాలంటున్నాయి. పాజిటివ్‌ స్పందన ఒక్కసారిగా నెగెటివ్‌గా మారగానే కలిగే రాజకీయ ప్రకంపనలు సహజంగానే అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తాయని, అయితే ప్రజాసంక్షేమంపై మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరాన్ని దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌కు గుర్తు చేశారన్నది విశ్లేషకుల మాట. ‘రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ హనీమూన్‌ ముగిసినట్టే. ఇకపై జాగ్రత్తగా ముందుకెళ్తేనే అధికారం నిలబడుతుంది. లేదంటే ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి. పార్టీలకతీతంగా ప్రశ్నించే గొంతుకలను ప్రజలు ఆదరిస్తారు’అన్న ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడి వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ కర్తవ్యాన్ని తెలియజేస్తున్నాయి.  (దుబ్బాక ఫలితంపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం)

కాంగ్రెస్‌: ఆశ నిరాశే
ఆరేళ్లుగా ఓటమి మాత్రమే తెలిసిన ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి దుబ్బాక ఫలితం మళ్లీ చేదుగుళికే అయ్యింది. దీర్ఘకాలంగా సంప్రదాయకంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ పద్ధతి మార్చుకుని దూకుడు పెంచకపోతే రాష్ట్రంలో చిన్న ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోతుందనే సంకేతాల్ని కాంగ్రెస్‌ నేతలకు ఈ ఎన్నికలు పంపాయనేది రాజకీయ వర్గాల భావన. జాతీయ స్థాయిలో ఉన్న మరో పార్టీ రాజకీయ క్షేత్రంలో గుర్రంలా దౌడుతీస్తోంటే ఇంకా తాబేలు–కుందేలు కథ మాదిరిగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తే కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దుబ్బాకలో ఓటమి నష్టమే అయినా ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఆసక్తిని కలిగిస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట కేడర్‌ ఉన్న కాంగ్రెస్‌ను సంస్థాగత మార్పులు, పార్టీ నాయకత్వ వైఖరిలో మార్పు, కీలక నేతల్లో ఐక్యత మాత్రమే కాపాడతాయని, లేదంటే దుబ్బాక ఫలితమే పునరావృతమవుతుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.   (టీఆర్‌ఎస్‌ కంచుకోటలో కమలదళం పాగా)

బీజేపీ: కమల దళానికి ఊపు
అనూహ్య విజయం సాధించిన బీజేపీకి ఈ ఫలితం మంచి బూస్టేనని చెప్పకతప్పదు. కేంద్రంలో ఉన్న అధికారం అండతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పక్షంగా ఎదగాలనే కమలనాథుల ఆకాంక్ష నెరవేర్చేందుకు దుబ్బాక ఎన్నిక బాటలు వేసిందని రాజకీయ వర్గాలంటున్నాయి. జాతీయ పార్టీగా రాష్ట్రంపై పట్టు సాధించాలనే ఆరాటంతో కొంత దూకుడుగానే పోతున్న బీజేపీ నేతలకు దుబ్బాక ఫలితం కిక్కునిచ్చినా ముందుంది మామూ లు పండుగేమీ కాదని, ఇంకా చాలా కష్టపడితేనే కమలనాథుల ఆశలు నెరవేరుతాయని విశ్లేషకులంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20– 30 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ మోస్తరు ఓట్లు సాధించే పరిస్థితి లేదని గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రే ఫలితాలు తారుమారుకావని, మూడుసార్లు ఓడిపోయినా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్న రఘునందన్‌రావులాంటి నాయకులు చాలామంది రావాలని, క్షేత్రస్థాయిలో ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని బీజేపీ నేతలు గుర్తించాలని రాజకీయ వర్గాలంటున్నాయి.  

మరిన్ని వార్తలు