Karnataka: టార్గెట్‌ 2023.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు

30 Jul, 2021 10:46 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో జంబో కేబినెట్‌

బెంగళూరు: గత కొద్ది రోజుల నుంచి కర్ణాట​క రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి మార్పు గురించి పలు ఊహాగానాలు వెలువడినప్పటికి మాజీ సీఎం యడియూరప్ప వాటిని ఖండించారు. కానీ దక్షిణాదిలో తమకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యాయం మొదలు పెట్టింది. యడ్డీ వారసుడిగా ఆయన మంత్రివర్గంలో పని చేసిన బసవరాజ్‌ బొమ్మైని ముఖ్యమంత్రిగా నియమించింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోనే.. బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కొత్త సీఎం బొమ్మై కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బొమ్మై, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాక అతని కేబినెట్‌లో ఆరు నుంచి ఎనిమిది మంది కొత్తవారికి.. అందునా యువకులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బొమ్మై క్యాబినెట్‌లో గరిష్టంగా 34 మంది సభ్యులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి 2019 లో ఐదుగురు డిప్యూటీ సీఎంలతో కూడిన జంబో బృందాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కేబినెట్ ఏర్పాటుపై చర్చిస్తున్నట్లు కర్ణాటక బీజేపీ సీనియర్ కార్యనిర్వాహక అధికారి ఒకరు తెలిపారు, ఎస్సీలు, ఎస్టీలు, వోక్కలిగాస్, లింగాయతులు, ఓబీసీ అనే ఐదు ప్రధాన సామాజిక వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. 2008 నుంచి అసెంబ్లీ ఎన్నికలలో 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటడానికి బీజేపీ కష్టపడుతోంది. ఈ క్రమంలో అన్ని వర్గాల వారికి చేరువయ్యేందుకు బీజేపీ అధిష్టానం ఐదుగురు డిప్యూటీ సీఎంల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా, పార్టీ కేంద్ర నాయకత్వం మాజీ సీఎం బీఎస్ యడియూరప్పతో పాటు లింగాయత్‌ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచింది. ప్రస్తుతం వారు ఇతర సామాజిక వర్గాలు ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు