పెద్దపల్లిలో కాషాయజెండా ఎగరేద్దాం

7 Aug, 2020 10:25 IST|Sakshi
ప్రదీప్‌రావును సన్మానిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ

కేంద్రప్రభుత్వ పథకాలతో గ్రామాల అభివృద్ధి

రాష్ట్రంలో అవినీతిపాలన సాగుతోంది 

ఫాంహౌస్‌ పాలనకు చరమగీతం పాడుదాం

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు

పెద్దపల్లిరూరల్‌: ప్రత్యేక రాష్ట్రమొస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రజలకు అవినీతి పాలనను అందిస్తూ.. ఫాంహౌస్‌కే పరిమితమైన టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడి, వచ్చే ఎన్నికల్లో కాషాయజెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమితులైన తర్వాత తొలిసారిగా గురువారం పెద్దపల్లికి వచ్చిన ఆయనకు జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. ప్రదర్శనగా పట్టణంలోని నందనగార్డెకు చేరారు. బీజేపి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి, సనత్‌కుమార్‌ తదితరులు హాజరైన సమావేశంలో మాట్లాడారు. ఇంతకాలం పెద్దపల్లిపై కమ్ముకున్న మేఘాలు తొలగిపోయాయన్నారు. అటు కరీంనగర్, ఇటు నిజామాబాద్‌ ఎంపీ స్థానాలను కమలదళం దక్కించుకోవడంతో పెద్దపల్లి పరిసరాల దాకా కమలం వికసించిందని, ఈసారి పెద్దపల్లిలోనూ కమలవికాసం జరిగితీరాలన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ప్రపంచం గర్వించదగ్గ రీతిలో పాలన సాగుతోందని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా ముందుకుసాగాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమపథకాల ఫలాలే గ్రామీణ ప్రజలకు అందుతున్నాయన్న విషయాన్ని అర్థమయ్యేలా వివరించి మద్దతు కూడగట్టాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసేదిశగా అడుగేయాలన్నారు. ఎన్నికలెపుడొచ్చినా బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇపుడు రాష్ట్రనాయకత్వం మార్పుతో పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఇదే ఊపుతో పార్టీని గ్రామగ్రామాన పటిష్టపర్చాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మాతంగి రేణుక, ఠాకూర్‌ రాంసింగ్, రాజం మహంతకృష్ణ, బండి శరత్, చిలారపు పర్వతాలు, తంగెడ రాజేశ్వర్‌రావు, బెజ్జంకి దిలీప్, గూడెం జనార్దన్‌రెడ్డి, తొడుపునూరి కృష్ణమూర్తి, కందునూరి ప్రమోద్‌రావు, ఎంచర్ల కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు