లవ్‌ జిహాద్‌పై శ్రీధరన్‌ సంచలన వ్యాఖ్యలు!

20 Feb, 2021 15:29 IST|Sakshi

తిరువనంతపురం: లవ్‌ జిహాద్‌ కారణంగా ఎంతో మంది అమాయక యువతులు బలైపోతున్నారని ‘మెట్రో మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ శ్రీధరన్‌ అన్నారు. కేరళలో ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కాగా మెట్రో మ్యాన్‌గా ప్రసిద్ధి పొందిన శ్రీధరన్‌ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ‘‘విజయ యాత్ర’’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 21న ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ జాతీయ మీడియాతో పలు అంశాల గురించి మాట్లాడారు.

‘‘కేరళలో లవ్‌ జిహాద్‌ పరిణామాలు చూస్తూనే ఉన్నాను. హిందువులను ఎలా బలవంతపు పెళ్లిళ్లతో బంధిస్తున్నారు? ఆ తర్వాత వాళ్లు ఎలాంటి బాధలు పడుతున్నారు? అన్న అంశాలు గమనిస్తున్నా. కేవలం హిందువులు మాత్రమే కాదు.. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి వాటికి నేను పూర్తి వ్యతిరేకం’’ అని శ్రీధరన్‌ పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో పాలన గురించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను నియంతగా అభివర్ణించారు. ‘‘ఈ సీఎం పాలనకు 10కి మూడు మార్కులు కూడా రావు. ఆయన అసలు ప్రజలతో మమేకం కారు. సీపీఎం పట్ల ప్రజల్లో సదభిప్రాయం లేదు.

మంత్రులకు కూడా ధైర్యంగా మాట్లాడే స్వేచ్చ లేదు. అభిప్రాయాలు పంచుకునే స్వాతంత్ర్యం లేదు. నియంత పాలనకు ఇదే నిదర్శనం’’ అని విమర్శించారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తానని, పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ శ్రీధరన్‌ తన మనుసులోని మాట బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ రంగప్రవేశానికి ముందే ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టారు.
చదవండి: సీఎం పదవి చేపట్టడానికి నేను రెడీ: శ్రీధరన్‌
చదవండిబీజేపీకి షాక్‌: హస్తం గూటికి ఎంపీ తనయుడు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు