తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకం: ఈటల

19 Jun, 2021 16:59 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు గొప్పవని చెప్పుకునే పరిస్థితి మాత్రమే ఉందని.. ప్రజలు హక్కుదారులు కాదు.. బిచ్చగాళ్లుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు.

తమ హక్కుల్ని భంగం కలిగించే ప్రయత్నం చేస్తే దేనినైనా ధ్వంసం చేయడానికి వెనుకాడమన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాముల దూరినట్లు తనపై ఓ మంత్రి మాట్లాడటం వాళ్ల సంస్కారానికి నిదర్శనమన్నారు. కులం, మతంతో తనకు సంబంధం లేదు, పార్టీ కార్యకర్తలు వారి ఆలోచనతో సంబంధం ఉంటుందని ఈటల రాజేందర్‌ అన్నారు.

ప్రతి పైసా కేంద్రం ఇచ్చినవే: బండి సంజయ్‌
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి నిధులు, సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో ఖర్చు చేసిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చినవేనన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా ఎన్ని నిధులు కేటాయించారో, కేంద్ర వాటా లేని సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘నమ్ముకున్న సిద్ధాంతం కోసం పని చేసే పార్టీ బీజేపీ. తెలంగాణ అధికారం చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నాం. మాట తప్పిన సీఎంను అడ్రస్ లేకుండా చేయాలి. తెలంగాణలో మార్పు కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మలిదశ ఉద్యమానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్‌ తెలిపారు.

చదవండి: Huzurabad: ‘సాగర్‌’ ఫార్మూలాతో ఈటలకు చెక్‌.. బాస్‌ ప్లాన్‌ ఇదేనా?
తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత

మరిన్ని వార్తలు