కేసీఆర్‌కు ఈటల కౌంటర్‌.. ఆస్తులు అమ్మకుండా జీతాలు ఇవ్వగలరా?

20 Aug, 2022 18:39 IST|Sakshi

సాక్షి, మునుగోడు: టీఆర్‌ఎస్‌ తలపెట్టిన ప్రజా దీవెన సభలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. సభ వేదిక నుంచి కేసీఆర్‌ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. 

హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ చెప్పే చిల్లర మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.. ప్రజలను మెప్పించే శక్తిని కేసీఆర్‌ కోల్పోయారు. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వం. కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. కేసీఆర్‌ మాటలకు రేపటి సభలో తప్పకుండా సమాధానం చెబుతాము. 

మీటర్లు పెట్టాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. బీజేపీకి ఓటెస్తే మీటర్లు వస్తాయన్నది అబద్ధం. రైతులను ఒక దోషిగా బజారులో నిలిబెట్టింది కేసీఆర్‌. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వపరమైన ఆస్తులు అమ్మకుండా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సీపీఐ పార్టీని నేరుగా ప్రశ్నిస్తున్నాను. ప్రజల పక్షం అని చెప్పుకునే సీపీఐ నేతలు మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సమస్యలు చెప్పారా?. కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఇతర సమస్యలపై సీఎం కేసీఆర్‌కు కలిశారా?. ప్రగతి భవన్‌కు మీరు వెళ్లారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఇది కూడా చదవండి: మల్లారెడ్డా మజాకా మామూలుగా ఉండదు.. మాస్‌ డ్యాన్స్‌తో ఇరగదీసిండు..

మరిన్ని వార్తలు