-

కేసీఆర్‌ అహంకారాన్ని బొంద పెట్టేది హుజురాబాద్‌ ఎన్నిక: ఈటల

30 Aug, 2021 08:37 IST|Sakshi

ఉమ్మడి రాష్ట్రంలో స్వయం పాలన కోసం పోరాడాం

ఇప్పుడు ఆత్మ గౌరవం కోసం కొట్లాడుదాం

యావత్‌ తెలంగాణ చూపు హుజూరాబాద్‌ వైపు

రాచపల్లిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

ఇల్లందకుంట (హుజురాబాద్‌): హుజూరాబాద్‌లో జరుగనున్నది కేసీఆర్‌ దొరతనాన్ని, అహంకారాన్ని బొందపెట్టే ఉప ఎన్నిక అని.. కేసీఆర్‌ నిరుంకుశ పాలన గెలుస్తుందా.. ప్రజలు గెలుస్తారా అని యావత్‌ తెలంగాణ హుజూరాబాద్‌ వైపు చూస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఈటల సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వయం పాలన కోసం కొట్లాడితే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో లిక్కర్‌ మీదనే సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయలు వస్తాయని, ఇప్పుడు సర్కార్‌ ఇచ్చే ప్రతీ పైసా మనదే అని పేర్కొన్నారు. చైతన్యాన్ని, ప్రశ్నించే వాడిని రక్షించుకోపోతే సమాజం బానిసత్వంలోకి జారిపోతుందన్నారు.  మూడు నెలలుగా కేబినెట్‌ను ఏర్పాటు చేయకుండా కేసీఆర్‌ నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని విమర్శించారు. ఉద్యమంలో తనతో పాటు లెఫ్ట్‌ రైట్‌గా పనిచేసిన వాళ్లు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, గతాన్ని మరిచి మాట్లాడవద్దని హితువు పలికారు. ముఖ్యమంత్రి మొదటిసారిగా జై భీమ్‌ అంటూ దళితులతో కలిసి భోజనం చేస్తూ కపట ప్రేమ చూపిస్తున్నారని.. ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌కు పోలీసుల బెదిరింపులు కొత్తకాదని, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు.

చదవండి: రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది

మరిన్ని వార్తలు