శివసేన షిండే వర్గం ఎన్నికల గుర్తు ఇదే.. ఫైనల్ చేసిన ఈసీ

11 Oct, 2022 18:28 IST|Sakshi

ముంబై: అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఏకానాథ్ షిండే వర్గానికి 'రెండు కత్తులు-డాలు' గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించించి. షిండే వర్గం పార్టీ పేరును 'బాలాసాబెబ్‌చీ శివసేన'గా ఈసీ సోమవారం ఫైనల్ చేసిన విషయం తెలిసిందే.

అసలైన శివసేన తమదంటే తమదే అని ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని ఈసీ తాత్కాలికంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నికల కోసం కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి షిండే, థాక్రే వర్గాలు ఈసీకి కొన్ని ప్రతిపాదలను పంపాయి.

వీటిని పరిశీలించిన అధికారులు థాక్రే వర్గానికి 'శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్‌ థాక్రే)' పేరు, కాగడా గుర్తును సోమవారం ఖరారు చేసింది. అలాగే షిండే వర్గానికి 'బాలాసాహెబ్‌ శివసేన' పేరును ఫైనల్ చేసింది. కానీ షిండే అడిగిన ఎన్నికల గుర్తులు కొన్ని ఇప్పటికే రిజిస్టర్ అయినందున ఎలాంటి గుర్తును కేటాయించలేదు.  మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే షిండే వర్గం మంగళవారం సూర్యుడు, కత్తి-డాలు, రావిచెట్టు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఈసీని మళ్లీ కోరింది. వీటిని పరిశీలించిన ఈసీ రెండు కత్తులు-డాలు గుర్తును ఫైనల్ చేసింది. శివసేన ఎవరిదో తేలేవరకు షిండే, థాక్రే వర్గాలకు ఈ పార్టీ పేర్లు, గుర్తులే ఉండనున్నాయి. 
చదవండి: ఇదేనా మీకు నేర్పింది? రిక్షా బోల్తాపడినా ఆగని కలెక్టర్ కాన్వాయ్‌

మరిన్ని వార్తలు