మమత ప్రచారంపై ఈసీ నిషేధం

13 Apr, 2021 06:07 IST|Sakshi

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడం, కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సోమవారం ఎన్నికల సంఘం స్పందించింది. 24 గంటల పాటు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిషేధం విధించింది. ఏప్రిల్‌ 12 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్‌ 13 రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది.

షోకాజ్‌ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో కీలక అంశాలను ఆమె కావాలనే దాటవేశారని వ్యాఖ్యానించింది. ఈసీ నిర్ణయంపై మమత తీవ్రంగా స్పందించారు. ఈ నిషేధం రాజ్యాంగవిరుద్ధమని, దీనిపై కోల్‌కతాలో నేడు(మంగళవారం) ధర్నా చేస్తానని ప్రకటించారు. ఈసీ నిష్పక్షపాక్షితపై తమకు మొదట్నుంచీ అనుమానాలున్నాయని టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్‌ సిన్హా వ్యాఖ్యానించారు. మమతపై విధించిన తాజా నిషేధంతో ఈసీ వేసుకున్న ముసుగు పూర్తిగా తొలగిపోయిందని, ఎలక్షన్‌ కమిషన్‌ పూర్తిగా మోదీ, షాల ఆదేశాల మేరకు పనిచేస్తోందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు