Manchireddy Kishan Reddy: అధికార పార్టీలో ఈడీ కుదుపు..

28 Sep, 2022 10:42 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఏకంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన మంగళవారం ఈడీ ముందు హాజరయ్యారు. జిల్లా పార్టీ అధినేతపైనే మనీలాండరింగ్‌ ఆరోపణలు రావడం, ఈడీ నోటీసులు జారీ చేయడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.

మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో రెండోసారి విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టింది.  

సర్వత్రా చర్చనీయాంశం 
2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్‌మైన్స్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంపై ఆయనకు నెల రోజుల క్రితమే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. సంతృప్తి చెందని ఈడీ స్వయంగా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చే యడంతో ఆయన ఈడీ ముందు హాజరవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్లలోనూ ఆందోళన మొదలైంది.

మరోవైపు ఇటీవల ఈడీ విచారించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి శ్రీనివాస్‌తోనూ మంచిరెడ్డికి సంబంధాలున్నాయని, ఈ కేసులోనూ ఆయనను విచారించే అవకాశాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు 2014లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో మంచిరెడ్డి సహా పలువురు పర్యటించారు. ఈ సందర్భంగా వినియోగించిన వ్యయంపై అనుమానాలు రావడం.. ఈ నిధులు విదేశాల నుంచి వచ్చినట్లు ఆరోపణలు రావడం కూడా ఈడీ విచారణకు కారణంగా కనిపిస్తోంది. ఈడీ మాత్రం మంచిరెడ్డిని ఏ కేసులో విచారించారనేదానిపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.   

ప్రజలకు వివరణ ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అక్రమ సంపాదనపై ఈడీ విచారణ.. గతంలో వచ్చిన జూదం, భూ ఆక్రమణలపై ఇబ్రహీంపట్నం ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, ఒక ప్రజాప్రతినిధిగా జవాబుదారీగా ఉండాలని హితవుపలికారు. ఆయనపై ఇది కొత్త ఆరోపణ కాదని, అనేక భూ తగాదాల్లో ప్రజల పక్షం కాకుండా రియల్టర్ల పక్షాన నిలబడినట్లు విమర్శలు ఉన్నాయని తెలిపారు. తాజాగా ఖానాపురం గ్రామ ప్రజల విషయంలోనూ ప్రజల పక్షాన లేరన్నారు. వరుస ఆరోపణల నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. 

మరిన్ని వార్తలు