Charanjit Singh Channi-ED Raids: ఈడీ దాడుల కలకలం.. పంజాబ్‌ సీఎం మేనల్లుడి ఇళ్లల్లో సోదాలు

19 Jan, 2022 02:07 IST|Sakshi

అక్రమ ఇసుక మైనింగ్‌పై దర్యాప్తు 

తమపై ఒత్తిడికి కేంద్రం చేసే యత్నమని పంజాబ్‌ సీఎం విమర్శ 

సీఎంకు సంబంధముందని విపక్షాల ఆరోపణలు 

చండీగఢ్‌: ఎన్నికల వేళ పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువుల నివాసంతో పాటు పలు చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం దాడులు జరిపింది. ఇసుక మాఫియా మనీ లాండరింగ్‌ (హవాలా) వ్యవహారాలపై విచార ణలో భాగంగా అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న పలు కంపెనీలు, వ్యక్తులకు చెందిన ప్రదేశాలపై దాడులు చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు. చండీగఢ్, మొహాలి, లుధియానా, పఠాన్‌కోట్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా డజనుకుపైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించామన్నారు. మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) నిబంధనల్లో భాగంగా దాడులు నిర్వహించామని చెప్పారు. దాడుల్లో ఈడీ అధికారులకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు తోడుగా ఉన్నాయి. నవాన్‌షమర్‌కు చెందిన కుద్రత్‌ దీప్‌ సింగ్‌ చెందిన ఒక కంపెనీకి భూపీందర్‌ సింగ్‌ అలియాస్‌ హనీ డైరెక్టర్‌గా ఉన్నారు.

చరణ్‌ జిత్‌ సింగ్‌ మరదలి కుమారుడైన ఈ హనీకి పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఒక కంపెనీ ఉంది. 2018లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 30 ట్రక్కులను పోలీసులు పట్టుకొని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇదే సమయంలో దీప్‌సింగ్, హనీల కంపెనీలపై పలు ఫిర్యాదులు అనేక స్టేషన్లలో నమోదయ్యాయి. 2018లో నవాన్‌షహర్‌ ఎఫ్‌ఐఆర్‌తో పాటు పలు కంపెనీలు, వ్యక్తులపై ఇతర స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ విచారణ ఆరంభించింది. కుద్రత్‌దీప్‌ సింగ్‌తో హనీకి ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది.

కొన్ని కోట్ల విలువైన ఇసుక మైనింగ్‌ కాంట్రాక్ట్‌ను చిన్న కంపెనీ పొందలేదని, కేవలం నల్లధనం పెట్టుబడిగా పెట్టడం వల్లనే హనీ కంపెనీకి కాంట్రాక్ట్‌ లభించిఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్రమ మైనింగ్‌పై సీఎం చన్నీ  ఎలాంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని సమ ర్థించుకున్నారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రివాల్‌ ఆరోపించారు. చన్నీ, ఆయన కుటుంబం అక్రమ మైనింగ్‌లో భాగస్వాములని, ఇలాంటి వారి చేతిలో పంజాబ్‌ భవితవ్యం బాగుపడదని దుయ్యబట్టారు.  

చదవండి: పంజాబ్‌ ఆప్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్‌

ఈ దాడులు పూర్తిగా కక్షపూరితం. బెంగాల్‌ ఎన్నికల వేళ అక్కడి సీఎం మమతాబెనర్జీ బంధువులపై దాడులు జరిగాయి. పంజాబ్‌లో కూడా కేంద్రం ఇదే ధోరణి అవలంబిస్తోంది. ఈడీ దాడులతో నాపై, నా మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ సభ్యులపై ఒత్తిడి తెచ్చే యత్నాలు చేస్తున్నారు. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు 
– పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ  
చదవండి: బీజేపీ ఇవ్వనంటోంది! ఇతర పార్టీల నుంచి ఆఫర్లు..

మరిన్ని వార్తలు