అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళని

8 Oct, 2020 03:24 IST|Sakshi
చెన్నైలో పళనిస్వామికి శాలువా కప్పి సన్మానిస్తున్న పన్నీర్‌సెల్వం

ముగిసిన సంక్షోభం

ఒక్కటైన పళని, పన్నీర్‌

సాక్షి, చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలో ఇద్దరు అగ్రనాయకులు పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం మధ్య ఆధిపత్య పోరుకి తెరపడింది. ముఖ్యమంత్రి కె. పళనిస్వామినే తిరిగి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారం చేపట్టడానికి ఇరువురు అగ్ర నేతలు కలిసి పనిచేయాలని నిర్ణయించడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సా హాలు వెల్లువెత్తాయి. బుధవారం నాడు పార్టీ ప్రధాన కార్యాల యంలో స్వయంగా పన్నీర్‌ సెల్వం నేతల హర్షధ్వానాల మధ్య సీఎం  అభ్యర్థిగా పళనిస్వామి పేరుని ప్రకటించారు. ‘‘నా ప్రియ సోదరుడు పళనిస్వామిని ముఖ్య మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

2021 ఎన్నికల్లో ఆయన విజేతగా నిలుస్తారు’’అని పళనిస్వామి అన్నా రు. ఆ తర్వాత 11 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పట్నుంచో పన్నీర్‌ సెల్వం ఈ స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటుకు పట్టుబడుతూ ఉంటే, పళనిస్వామి దానిని వ్యతిరేకిస్తున్నారు. ఇక సీఎం అభ్యర్థిత్వంపైనా ఇరువురు నేతల మధ్య గత కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. సెప్టెంబర్‌ 28న పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో ఇద్దరూ సీఎం పదవి తనకి కావాలంటే, తనకంటూ తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పార్టీ నేతలు దిగ్భ్రాంతి చెందారు. స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు పైనా కూడా ఇద్దరి మ«ధ్య మాటా మాటా పెరిగింది. అప్పట్నుంచి పన్నీర్‌ సెల్వం ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజరవుతూ వచ్చారు. కొందరు నాయకుల చొరవతో మళ్లీ ఇద్దరూ రాజీకి రావడంతో సంక్షోభం ముగిసింది. వచ్చే ఏప్రిల్, మేలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

పన్నీర్‌ను మించిపోయేలా
జయలలిత మృతి తర్వాత సీఎం అయ్యే అవకాశం తొలుత పన్నీర్‌ సెల్వంకే వచ్చింది. అయితే కొన్నాళ్లకే ఆయన శశికళపై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చారు. కానీ సరిపడినంత ఎమ్మెల్యేల బలం లేక పదవిని కోల్పోయారు. అదే సమయంలో శశికళకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడడంతో ఆమెకు అత్యంత విధేయుడిగా పేరు పడిన పళనిస్వామిని శశికళ సీఎంని చేశారు. ఆమె జైలుకి వెళ్లిన అనంతరం పన్నీర్‌తో చేతులు కలిపిన పళనిస్వామి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ని పార్టీ నుంచి గెంటేశారు.  క్రమక్రమంగా ఆయన తనకున్న రాజకీయ చాతుర్యంతో పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. జయలలిత మరణానంతరం పార్టీ, ప్రభుత్వంలో శశికళ తర్వాత అంతటి పట్టు సాధించిన వారు పళని. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కి పోటీ ఇవ్వగలిగిన నాయకుడు ఏఐఏడీఎంకేలో పళనిస్వామి తప్ప మరొకరు లేరన్న అభిప్రాయం ఉంది.

మరిన్ని వార్తలు