ఆత్మరక్షణలో టీడీపీ, ఈనాడు.. సెల్ఫ్‌ గోల్‌ అంటే ఇదే!

16 Mar, 2023 16:28 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం, ఈనాడు మీడియా  సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నాయి. ముఖ్యంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవమానించారంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  ప్రకటన చేయడం, దానిని ఈనాడు  ప్రచురించడం పెద్ద వివాదమైంది. ఈ అంశంలో తెలుగుదేశం, ఈనాడు ఆత్మరక్షణలో పడ్డాయి. 

అలాగే విద్యా రంగానికి సంబంధించి వేసిన ప్రశ్నలో టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయులు స్కూళ్ల మూసివేత అంటూ చేసిన ఆరోపణపై బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించడంతో మరోసారి ప్రతిపక్షం ఇరుకున పడింది. ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ప్రతిపక్షం, ఈనాడు తదితర టీడీపీ మీడియా సంస్థలు వాస్తవాలతో నిమిత్తం లేకుండా తప్పుడు ప్రచారం చేయబోయి బొక్క బోర్ల పడుతున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ వచ్చి ప్రసంగం చేయడం సంప్రదాయం. గవర్నర్‌కు ముఖ్యమంత్రి , శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్లు  స్వాగతం చెప్పి సభలోకి తీసుకు వస్తారు. ఇది ఎప్పుడూ జరిగే విషయమే. ఈసారి గవర్నర్ కొంత భిన్నంగా స్పీకర్  ఛాంబర్‌లోకి వెళ్ళి కొద్దిసేపు ఉన్నారు. ఇలాంటి ఘటనలను రిపోర్టు చేయడం తప్పు కాదు. కాని దానిని వక్రీకరించి, జరగని దానిని జరిగినట్లు టీడీపీ సభ్యులు ఆరోపించడం, దానిని ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించడం చాలా పెద్ద తప్పు అని చెప్పాలి. 

గవర్నర్ తన వ్యక్తిగత అవసరం రీత్యా స్పీకర్ చాంబర్‌లోకి వెళ్లారు. ఆ సందర్భంగా వీరంతా కొన్ని నిమిషాలపాటు అక్కడ కూర్చున్నారు. తదుపరి శాసనభలోకి వచ్చి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆ క్రమంలో కూడా ఆయన గొంతు నొప్పితో బాధపడుతూ అప్పుడప్పుడూ మంచినీరు కూడా తీసుకోవడం అంతా చూశారు. ఈ వ్యవహారంపై కేశవ్‌కు ఎవరు బ్రీఫ్ చేశారో తెలియదు కానీ, ఆయన అన్ని విషయాలు తెలుసుకోకుండానే గవర్నర్‌కు అవమానం జరిగినట్లు మీడియా ముందు కామెంట్ చేశారు. 

ముఖ్యమంత్రి జగన్ కోసం గవర్నర్ నజీర్ ఎదురు చూసినట్లు ఆయన ఆరోపించారు. దీనిని ఈనాడు దినపత్రిక ప్రచురించింది. నిజానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీడియావారు ఎవరైనా సరే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, బహుశా టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా తమకు తలనొప్పి వస్తుందేమోనని భయపడి కేశవ్‌కు చెప్పి మాట్లాడించి ఉండవచ్చు. గతంలో కూడా ఇలా అనేకసార్లు మీడియా చెప్పే మాటలు నమ్మి నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టేవారు. అప్పట్లో ఏదైనా తేడా వస్తే తాను అలా అనలేదని బుకాయించడానికి అవకాశం ఉండేది. ఆ రోజుల్లో సోషల్ మీడియా, వీడియో రికార్డింగ్ సదుపాయం ఉండేదికాదు. 

దానిని అడ్డం పెట్టుకుని నేతలు తప్పించుకునేవారు. కానీ, ఇప్పడు సోషల్ మీడియా, పూర్తి స్థాయిలో వీడియో చిత్రీకరణ జరుగుతోంది. ఏపీ శాసనసభలోకి గవర్నర్ కాన్వాయ్‌ వస్తున్న సన్నివేశాల మొదలు తిరిగి ఆయన వెళ్లిపోయేంతవరకు అంతా వీడియో రికార్డు అయింది. దాంతో కేశవ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇది కేశవ్ చెబితే రాశారా?.. లేక ఈనాడు తప్పుడు కథనం రాసిందా? అన్నది తేల్చాలని , వీరిపై సభా హక్కుల ఉల్లంఘన పెట్టాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో సహా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, మంత్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈనాడు అధినేత రామోజీరావు నిత్యం అసత్యాలు వండి వార్చుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో రామోజీని సభకు రప్పించాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. కేశవ్ దీనిపై సమాధానం ఇస్తూ తొలుత అటుఇటుగా మాట్లాడినా, ఆయన మీడియాతో చెప్పిన విషయాలను కూడా బుగ్గన ప్రదర్శించడంతో అవాక్కవాల్సి వచ్చింది. 

దీనిపై ఆయన ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా, వైఎస్సార్‌సీపీ నేరుగా గవర్నర్‌ను కించపరిచారని అన్నారా? లేదా? మీరు అనకపోతే ఈనాడు కావాలని తప్పుడు వార్త రాసిందా? అన్నది చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో టీడీపీ, ఈనాడు పత్రిక డిఫెన్స్‌లో పడ్డాయి. కేశవ్ చేసింది గవర్నర్‌ను కించపరిచే విధంగా ఉందని, అందువల్ల ఆయనను, ఆ మీడియా సమావేశంలో పాల్గొన్న మరో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని సభ నుంచి ఈ సెషన్ అయ్యేంతవరకు సస్పెండ్ చేయాలని నిర్ణయించగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. వీరి సస్పెన్షన్‌పై ఆందోళనకు  దిగిన ఇతర టీడీపీ సభ్యులను కూడా ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు.

సాధారణంగా ప్రతిపక్షం సభలో ఏదైనా ప్రజా సమస్యలపైన పోరాడినట్లు కనిపించి సస్పెండ్‌ అవ్వాలని కోరుకుంటుంది. కానీ, ఇలా అబద్దాలు చెప్పి సస్పెండ్ అవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. కేశవ్ ప్రకటనను ప్రచురించిన ఈనాడుపై చర్య తీసుకునే విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని భావించారు. మీడియా రూల్స్ ప్రకారం తప్పుడు సమాచారంతో ప్రకటన చేయడం ఎంత తప్పో, దానిని ప్రచురించి ప్రచారం చేయడం కూడా అంతే తప్పుగా పరిగణించవలసి ఉంటుంది. అందులోనూ సభా వ్యవహారాలలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరో చేసిన ప్రకటనను తాము ప్రచారం చేశామని అంటే చెల్లదన్నది సూత్రం. కాకపోతే ఈ రోజుల్లో వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే మాత్రం అది సీరియస్ విషయమే అవుతుంది. గతంలో కూడా రామోజీరావుకు ఇలాంటి అనుభవం లేకపోలేదు. 

అప్పట్లో శాసనమండలిని ఉద్దేశించి ఈనాడులో పెట్టిన ఒక శీర్షిక వివాదాస్పదం అయింది. దాన్ని సభ తీవ్రంగా తీసుకుని రామోజీని సభకు పిలిపించాలని తీర్మానించింది. ఆ తరుణంలో రామోజీ హైకోర్టు నుంచి రక్షణ పొందారు. ఆయనను నిర్భందించి మండలికి తీసుకు వెళ్లాలని వచ్చిన ఆనాటి సిటీ పోలీస్ కమిషనర్ విజయరామరావు ఆ స్టే ఉత్తర్వును అనుసరించి వెనక్కి వెళ్లిపోయారు.

ఆ తర్వాత కూడా మీడియాపై సభలో చర్చలు జరిగినా, మరీ సీరియస్ అయిన సందర్భాలు తక్కువే. ఈసారి ప్రివిలేజ్ కమిటీ దీనిని ఏ విధంగా టేకప్‌ చేస్తుందన్నది  వేరే విషయం. కానీ, ఈ మొత్తం ఎపిసోడ్‌లో తప్పుడు ప్రకటన చేశారన్న విమర్శను తెలుగుదేశం పార్టీ, తప్పుడు వార్తను ప్రచురించారన్న విమర్శను ఈనాడు ఎదుర్కొన్నాయి. కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరిని పోలీసులు కొట్టారంటూ పాత ఫోటోలు వేసి ప్రతిష్టను దెబ్బ తీసుకున్న ఈనాడు మరోసారి శాసనసభ విషయంలో అప్రతిష్టపాలైంది. దానిని సహజంగానే వైఎస్సార్‌సీపీ అడ్వాంటేజ్‌గా తీసుకోగలిగింది. అసలే ఈనాడును దుష్టచతుష్టయంలో ఒక భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 

కానీ,  అలాకాకుండా కేవలం అహంతో వ్యవహరిస్తూ ఇలాంటి కథనాలు రాస్తున్నారు. మరో అంశం ఏమిటంటే ఏపీలో ప్రాథమిక స్కూళ్లను మూసివేశారంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే వీరాంజనేయులు ఆరోపించారు. దానిపై మంత్రి బొత్స సత్యనారాయణ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ హయాంలో ఐదువేల స్కూళ్లు మూతపడగా, వాటిలో  మూడువేల స్కూళ్లను తాము తెరిచామని చెప్పారు. ఎక్కడ స్కూళ్లు మూతపడ్డాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలా మూతపడినట్లు రుజువు చేస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ప్రత్యేకించి వీరాంజనేయులు నియోజకవర్గంలో ఫలానా గ్రామంలో స్కూల్ మూతపడిందని చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. దానికి టీడీపీ నీళ్లు నమలవలసి వచ్చింది. వైఎస్సార్‌సీపీపై ఏదో ఒక వ్యతిరేక వార్త రాసే పనిలో భాగంగా ఈనాడు పత్రిక ఆ స్కూల్ మూతపడిందనో లేక ఇంకొకటనో రాసేది. దానిని నమ్మి టీడీపీ ఎమ్మెల్యే సభలో మాట్లాడి పరువు పోగొట్టుకున్నారన్నమాట. 
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు