లోకేష్ పాదయాత్రకు ఎందుకింత హైప్‌.. ‘ఈనాడు’ భయం అదేనా?

22 Jan, 2023 11:47 IST|Sakshi

తెలుగుదేశం మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పాదయాత్రకు విపరీతమైన హైప్ సృష్టించడానికి  టీడీపీకి మద్దతు ఇచ్చే ఈనాడు మీడియా చాలా కష్టపడుతోంది. సాధారణంగా పాదయాత్ర ఆరంభం అయిన తర్వాత వచ్చే స్పందనను బట్టి మీడియా తగురీతిలో కవరేజీ ఇస్తుంటుంది. లేదా పార్టీ పరంగా ఈ సందర్భంగా జరిగే యాక్టివిటిని కవర్ చేయవచ్చు. కాని ఈనాడు మీడియా తనకు, తాను ఒక  భారీ కథనం రాస్తూ లోకేష్  యువగళాన్ని నొక్కేస్తారా! అంటూ ప్రశ్నించింది.

నిజానికి ఏ నాయకుడికి అయినా పాదయాత్ర చేసుకునే హక్కు ఉంటుంది. దానిని ఎవరూ కాదనజాలరు. ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పదు. కాని అదే సమయంలో ఒక ప్రముఖుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంటుంది. ప్రతి చిన్న,పెద్ద విషయానికి ఏపీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే పనిలో ఉన్న ఈనాడు మీడియా దీనిని కూడా వివాదాస్పదం చేయాలని యత్నిస్తోంది. దీనివల్ల లోకేష్‌కు ఒక నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆయన పాదయాత్రకు ఆశించిన రెస్సాన్స్ రాదేమోనని భయపడి ఈనాడు ఇంతగా హైప్ ఇస్తోందేమోనన్న భావన కలగవచ్చు.

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి నిర్దిష్ట ప్రశ్నలు వేసి తగు వివరాలు కోరారు. వాటిలో వేటికైనా జవాబు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ విషయం తెలియచేయవచ్చు. లేదా మరికొంత సమయం కోరవచ్చు. ఇప్పటికే ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఒక ప్రకటన చేస్తూ గతంలో పాదయాత్రలకు పోలీసులు ఇన్ని వివరాలు కోరారా అని అడిగారు. దానికి పోలీసు ఉన్నతాధికారులు సమాధానం చెబుతారు ఇక్కడ విశేషం ఏమిటంటే కుప్పం నుంచి ఆరంభం అయ్యే పాదయాత్రకు పోలీసులు వివరాలు అడగడం, వాటిని స్థానిక నేతలు అందించడం జరిగింది. 22 వాహనాల శ్రేణి లోకేష్‌తో పాటు ఉంటుందని తెలిపారు.

అంతేకాక ఆ వాహనాలను నడిపే డ్రైవర్ల జాబితా కూడా అందచేశారట. ఈ విషయం కూడా ఈనాడులోనే వచ్చింది. మరి అలాంటప్పుడు యువగళాన్ని అణచివేస్తున్నది ఎక్కడ? టీడీపీ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ఆందోళన చెందలేదు. కాని ఈనాడు మాత్రం టీడీపీ నేతలు అనుకుంటున్నారనుకుంటూ తన సొంత పైత్యం అంతటిని జోడించి ఓ పెద్ద స్టోరీని వండి వార్చింది. ఎవరైనా నాయకుడికి ప్రచారం చేయదలిస్తే ఇది ఒక టెక్నీక్. ఆ నాయకుడికి విపరీతమైన స్పందన వచ్చేస్తోందని, దానిని అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తుంటారు.

ఈనాడు కూడా అలాగే తంటాలు పడినట్లు అనిపిస్తుంది. గతంలో విపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర అప్పుడు అనుమతులు అవసరం లేదని ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారని కోట్ చేశారు. ఆయన ఏమన్నారో కాని, అప్పట్లో మరో నేత బొత్స సత్యారాయణ ఆద్వర్యంలో ఒకటికి ,రెండుసార్లు డిజిపి ఆఫీస్ కు వెళ్లి అనుమతులు కోరిన విషయాన్ని మాత్రం ఈనాడు విస్మరిస్తూ ప్రజలకు అర్ధ సత్యాలనే చేరవేస్తోంది.

కొద్ది కాలం క్రితమే కందుకూరులో పార్టీ అధినేత చంద్రబాబు  నాయుడు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది, గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ సందర్భంలో మరో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జిఓ 1 తెస్తే ప్రభుత్వం ప్రతిపక్షాల ర్యాలీలను అడ్డుకోవడానికే ఈ ఉత్తర్వు అని ఈనాడు ప్రచారం చేసింది. అంతే తప్ప పదకుండు మంది చనిపోవడంపై ఏ మాత్రం బాధపడినట్లు కనిపించలేదు.

ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో ఇలాంటివి ఏవైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి?. పోలీసులు ఎక్కువ మందిని భద్రత కోసం నియమిస్తే, ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడానికే ఇలా చేశారని విమర్శిస్తున్నారు. కాస్త తక్కువ మందిని పెడితే భద్రతను విస్మరించారని రాస్తున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మాదిరే డబుల్ టాక్ చేస్తున్న టీడీపీ మీడియాను ఎదుర్కోవడమే పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు వైసీపీ భయపడిపోతోందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వారికంటే ఎక్కువగా ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు భుజాన వేసుకుని అదే పనిలో ఉన్నాయి.

నిజానికి ఎవరి పాదయాత్రకు అయినా భయపడవలసిన పని లేదు.  ఇంతవరకు లోకేష్ తన ఎజెండా ఏమిటో చెప్పలేదు. కాని ఈనాడు మాత్రం వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నట్లు రాస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల గురించి వ్యతిరేకించే పరిస్థితి లేకపోవడంతో కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అరాచకపాలన అని, శాంతి భద్రతలు లోపించాయని, ఉన్నవి, లేనివి కలిపి అబద్దాలను సృష్టించే యత్నంలో ఉన్నారు. లోకేష్ ఇలాంటి మీడియాను నమ్మి యాత్రలు చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అన్న సంగతి తర్వాతకాలంలో కాని తెలియదు. ప్రస్తుతం ఆయన ప్రచారార్భాటం కోరుకుంటారు కనుక అంతా పచ్చగానే కనిపిస్తుంది.

లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర ఆరంభించడం ద్వారా అక్కడ కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం అయి ఉండవచ్చు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఏడుసార్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో గత స్థానిక ఎన్నికలలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు ఓకే అంటే  భవిష్యత్తులో ఆయన కూడా ఇక్కడ నుంచి పోటీచేస్తారేమో తెలియదు. ఏది ఏమైనా లోకేష్ పాదయాత్రలో ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేయడానికి టీడీపీ మీడియా విశ్వయత్నం చేస్తుంది. తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నదే వారి లక్ష్యం అని వేరే చెప్పనవసరం లేదు. కనుక తస్మాత్ జాగ్రత్త!
-హితైషి 

మరిన్ని వార్తలు