ఆ విషయాన్ని మాత్రం ‘ఈనాడు’ ఎందుకు చెప్పదు?

8 Feb, 2023 20:52 IST|Sakshi

ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాష్ట్రంపై విషం కక్కుతున్న ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు ఎలా అబద్దాలు ఆడుతున్నాయో కేంద్ర ప్రభుత్వ సమాచారం వెల్లడి చేసింది. ఈ మూడున్నరేళ్లలో బహుశా ఈనాడు పత్రిక రాష్ట్ర అప్పులపై రాసినన్ని కథనాలు మరే రాష్ట్రంలోను, ఏ పత్రిక రాసి ఉండదు. ప్రజలలో ఏదో రకంగా అనుమానం క్రియేట్ చేయడానికి, రాష్ట్రం అప్పులపాలైపోయిందని  ప్రచారం చేయడానికి ఈనాడు ఎంత నిస్సిగ్గుగా పనిచేసింది ఈ సమాచారం విశ్లేషిస్తే అర్థం అవుతుంది. ఇంతకాలం ఏమని రాశారు! రాష్ట్రం అప్పు ఎనిమిది లక్షల కోట్లు దాటిపోయిందని, ఇంకోసారి అది పది లక్షల కోట్లకు చేరిందని ఇలా తప్పుడు వార్తలు రాశారు.

వీరికి తోడుగా టీడీపీ ఎంపీలు తరచుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ప్రశ్నలు వేయడం, వారేమో వీరు ఆశించినంతగా భారీ అప్పులు ఉన్నట్లు చెప్పకపోవడం జరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వంపై బురద చల్లాలనుకున్న వీరి ఆశ నిరాశ అవుతోంది. టీడీపీ నేతలకంటే ఈనాడు, జ్యోతి వంటి మీడియాలకు మరీ బాధగా ఉంటోంది. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఉన్నవి, లేనివి కలిపి వండి మొదటి పేజీలలో ప్రచురిస్తున్నాయి. పెద్ద ఎత్తున టివీలలో ప్రసారం చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అడిగిన ప్రశ్నకు బదులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పు అంతా 4.42 లక్షల కోట్ల రూపాయలని తెలిపింది.

దాంతో నిరుత్సాహానికి గురైన ఈనాడు పత్రిక ఈ వార్తను లోపలి పేజీకే పరిమితం చేసింది. అదే నిజంగానే ఏ ఎనిమిది లక్షల కోట్లు అయి ఉంటే, అదే సమాచారం కేంద్రం ఇచ్చి ఉంటే, నానా రచ్చ చేస్తూ బానర్ కథనాలుగా ఇచ్చి ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం దొరకలేదు. నిజానికి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లు కరోనా కారణంగా ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంది. ఆ విషయం మాత్రం టీడీపీ మీడియా వారు కప్పిపెడుతుంటారు.

పోని పొరుగు రాష్ట్రాల అప్పుల గురించి, కేంద్రం అప్పు గురించి రాస్తారా అంటే అదేమీ చేయరు. వారంటే అంత భయం. కాని ఏపీకి వచ్చేసరికి ఎక్కడ లేనంతగా బురద చల్లుడులో బిజీగా ఉంటున్నారు. గతంలో పది లక్షల కోట్లు అని ప్రచారం చేశాం కదా.. కాని అది నాలుగున్నర లక్షల కోట్లే ఉందని, తప్పు రాశామని  వివరణ కూడా ఇవ్వరు. ఏదో మొక్కుబడిగా వార్త ఇస్తారు. మరో సంగతి ఏమిటంటే ఈ 4.2 లక్షల కోట్ల అప్పులో  2.64 లక్షల కోట్ల అప్పు గత తెలుగుదేశం ప్రభుత్వం పాలన ముగిసేనాటికి ఉంది.

రాష్ట్ర విభజన జరిగేనాటికి ఏపీ అప్పు సుమారు లక్ష కోట్ల వరకు ఉంటే, చంద్రబాబు ప్రభుత్వం ఒకటిన్నర రెట్ల మేర అప్పు చేసిందన్నమాట. ఆ విషయాన్ని మాత్రం ఎక్కడా ఈనాడు మీడియా చెప్పదు. కాని జగన్ ప్రభుత్వం చాలా అప్పు చేసిందన్న భ్రమ కల్పించడానికి యత్నిస్తుంటుంది. కార్పొరేషన్‌లు ద్వారా, ఇతరత్రా బడ్జెట్‌తో సంబంధం లేకుండా వేల కోట్ల అప్పులు చేస్తున్నారని ఈనాడు  కొంతకాలం గగ్గోలు పెట్టింది.

అవి కూడా రాష్ట్ర బడ్జెట్ అప్పులగానే చూస్తామని కేంద్రం చెప్పింది. దాంతో వీరికి సంతోషం కలిగింది. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అప్పులను పేద ప్రజలను ఆదుకోవడానికి ఉపయోగించిందని లెక్కలు చెబుతున్నాయి. మరి టీడీపీ పాలనలో అంత అప్పు తెచ్చి ఏమి చేశారో చెప్పలేని దయనీయ పరిస్థితి. పైగా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేనాటికి  ఖజానాలో వంద కోట్లే మిగిల్చి వెళ్లారు. ఈ విషయాలు ప్రజలు మర్చిపోయారని వారి విశ్వాసం.
చదవండి: ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై కుండబద్దలు కొట్టిన వైఎస్సార్‌సీపీ

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు పుట్టకుండా పోతాయని టీడీపీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు తదితర మీడియా సంస్థలు భావించాయి. కాని జగన్ ప్రభుత్వం విజయవంతంగా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడం వీరికి జీర్ణం కావడం లేదు. అందువల్లే కొద్ది రోజుల క్రితం కూడా ఈనాడు పత్రిక రాష్ట్రం అప్పులు అంటూ మొదటి పేజీలో వార్త ఇచ్చింది. కాని ఇప్పుడు కేంద్రం ఇచ్చిన సమాచారాన్ని మాత్రం లోపలిపేజీలోనే ప్రచురించింది.

అప్పుల గురించి వార్తా కథనాలు ఇవ్వదలిస్తే, గత ప్రభుత్వం ఎలా అప్పులు చేసింది.. ఈ ప్రభుత్వం ఎలా తీసుకు వచ్చింది. అప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి. మధ్యలో కరోనా వంటి సంక్షోభాలు మొదలైనవాటిని విశ్లేషించాలి. కాని అప్పట్లో విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిందని, అందువల్ల అప్పులు చేయక గత్యంతరం లేకుండా పోయిందని టీడీపీ పాలన టైమ్‌లో సమర్ధించారు. ప్రస్తుతం మాత్రం అప్పులు చేయడానికి వీలు లేదన్నట్లుగా వార్తలు రాస్తున్నారు. ఏది ఏమైనా అప్పుడప్పుడు అయినా టీడీపీ మీడియా వాస్తవాలు ప్రచారం చేస్తే వారికే మంచిది. లేకుంటే ప్రజలువారిని అసలు నమ్మరు.
-హితైషి

మరిన్ని వార్తలు