పప్పులు ఉడకలేదా?.. ‘ఈనాడు’ తన పరువు తానే తీసుకుందా?

12 Dec, 2022 19:33 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన వినూత్న పథకాలు ఎంతగా సఫలం అయింది ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి, ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చే ఈనాడు వంటి దినపత్రికల కథనాలను బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం గెలిస్తే  జగన్ తీసుకు వచ్చిన పథకాలను రద్దు చేస్తారని వలంటీర్లు ప్రచారం చేస్తున్నారని ఈనాడు ఒక కథనంలో ఆందోళన చెందింది. అలాగే చంద్రబాబు కూడా ఇప్పుడు సంక్షేమ రాగం ఆలపిస్తూ, తాను అధికారంలోకి వస్తే ఇంకా అధికంగా సంక్షేమం అమలు చేస్తానని, ఆ మాటకు వస్తే, తాను అమలు చేసిన వివిధ స్కీములను  ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని, వాటన్నిటిని వడ్డీతో సహా అమలు చేస్తామని ఆయన చెబుతున్నారు.

చంద్రబాబు స్కీములు అంత గొప్పవి అయితే, వాటిని నిజంగానే పేదలకు ఉపయోగపడేలా అమలు చేసి ఉంటే, 2019 ఎన్నికలలో అంత ఘోరంగా టీడీపీని ప్రజలు ఎలా ఓడించారు?. ఇప్పుడు జగన్ స్కీములను అమలు చేస్తామని వీరంతా చెబుతున్నారు. అంతదానికి జగన్ ప్రభుత్వాన్ని వదులుకునే అవసరం ప్రజలకు ఎందుకు వస్తుంది? ఇంతకాలం ఏమని వాదించారు. జగన్ స్కీముల వల్ల రాష్ట్రం నాశనం అవుతోందని, అప్పుల పాలు అవుతోందని జనంలో భయం రేకెత్తించడానికి తీవ్రంగా కృషి చేశారు.

ఆ విషయంలో వారి పప్పులు ఉడకకపోవడంతో స్వరం మార్చి కొత్త ప్రచారం మొదలు పెట్టారు. అందులో భాగంగానే జగన్  ప్రభుత్వంపై విషపూరిత కథనాలు, విద్వేషపూరిత స్టోరీలు ఇచ్చే పనిలో ఈనాడు మీడియా పడింది. ఒక పక్క కొత్త పరిశ్రమలు వస్తుంటే, మరిన్ని పరిశ్రమల కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే, వాటిని కనిపించకుండా  చేయాలన్న తాపత్రయంలో పరిశ్రమలను వెళ్లగొడుతున్నారంటూ పచ్చి అబద్దాలు రాశారు. ఇలా రోజుకోక అబద్దాన్ని జనంలోకి తీసుకు వెళ్లే యత్నం చేస్తున్నారు.

తాజాగా ఇచ్చిన ఒక కథనంలో వలంటీర్లు కాదు.. వైకాపా వేగులు అంటూ వలంటీర్లపై విమర్శలు ఎక్కుపెట్టారు. అది చదివితే ఈనాడు మీడియా బాధ, ఆందోళన అంతా తెలిసిపోతుంది. వలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వం జనంలో  పాతుకుపోతోందన్న భయం కనబడుతుంది. ఏ వ్యవస్థ అయినా ఎవరు అధికారంలో ఉంటే వారి ఆదేశాలను బట్టి నడచుకుంటుంది. ప్రజలకు వివిధ సేవలను అందిస్తుంటుంది. ఆ క్రమంలో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేదా అది ప్రజలకు ఉపయోగపడకపోతే  ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుంది. ఎక్కడైనా వలంటీర్లు తప్పు చేస్తే వార్తలు ఇవ్వవచ్చు. అందుకోసం ఈనాడు కాని, టీడీపీ మీడియా కాని డేగ కళ్లు వేసుకుని పనిచేస్తున్నదన్న సంగతి బహిరంగ రహస్యమే.

దానిని తప్పు పట్టనక్కర్లేదు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటనలో వలంటీర్ల పాత్ర ఉందన్న ఫిర్యాదు వచ్చినా, దానిని మొదటి పేజీలో హైలైట్ చేయడానికి యత్నిస్తోంది. నిజానికి వలంటీర్లు  ప్రభుత్వ వ్యవస్థలో అతి చిన్న స్థాయి వారు. కేవలం స్వచ్చందంగా  ప్రభుత్వం తరపున ప్రజలకు వివిధ స్కీములు చేరవేసేవారు. కాని వారిని అత్యంత పవర్ పుల్ వ్యక్తులుగా ఈనాడు మీడియా భావిస్తున్నట్లుగా ఉంది. వారు ప్రజలపై నిఘా ఉంచుతున్నారట. ఏకంగా రాజ్యంగం ప్రసాదించిన భావస్వేచ్చ ప్రకటనకు ఆటంకంగా ఉన్నారట. ఏమైనా అర్ధం ఉందా?. వీరివల్ల ప్రజల భావస్వేచ్చ ఎలా పోతుంది. అదే నిజమైతే ప్రజలలో అలజడి రాదా? ప్రభుత్వానికి నష్టం రాదా?. వచ్చే ఎన్నికలలో దాని ప్రభావం పడదా?.

నిజంగానే వలంటీర్లకు ప్రజలు భయపడుతున్నారనుకుందాం. వచ్చే ఎన్నికలలో ప్రజలు వైసీపీకి ఓటు వేస్తారా?. ఆ మాత్రం లాజిక్ లేకుండా వార్తలు ఇవ్వడం ద్వారా మొత్తం వ్యవస్థనే దెబ్బతీసే యత్నం చేశారు. ఆ క్రమంలో ఈనాడు తన పరువు తానే తీసుకుంటోంది. వలంటీర్లు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారట. అసలు వారు రాజకీయాలలోకి రారాదని ఎక్కడైనా నిషేధం ఉందా?. ఎంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర అధికారులు రాజీనామాలు చేసి మరీ రాజకీయాలలోకి వస్తున్నారు కదా? తెలుగుదేశం పార్టీ అలాంటి పలువురికి టిక్కెట్లు ఇచ్చింది కదా? అంటే అంతకుముందు పదవులలో  ఉంటూ రాజకీయాలపై ఆసక్తి కనబరిచినట్లా? కాదా? అంతెందుకు గతంలో ఇంటెలెజెన్స్ ఛీప్ గా ఉన్న ఒక అధికారి తెలుగు యువత అధ్యక్షుడిని నియమిస్తారని, స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుకున్న వీడియోనే ఉంది కదా?.

ఆ స్థాయిలో వారు రాజకీయం చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీని తమ భుజస్కందాల మీద మోసినప్పుడు ఈనాడు మీడియా కళ్లు మూసుకుందా? లేక ఆహా అంతటి పెద్ద అధికారి టీడీపీకి అండగా నిలబడ్డారని చంకలు గుద్దుకుందా?. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని అంటారు. ఈనాడు పరిస్థితి అలాగే ఉంది. టీడీపీ హయాంలో జరిగిన తప్పులన్నిటీని కప్పి పుచ్చి ఆ పార్టీని రక్షించాలని పాటు పడి, చివరికి దానిని గోతిలో పడేశారు.

ఇప్పుడు వైసీపీపై అక్కసుతో ఉన్నవి, లేనివి రాసి మరోసారి టీడీపీని ప్రజల నుంచి దూరం చేస్తున్నారనిపిస్తుంది. వలంటీర్లు ప్రతి నెల మొదటి తేదీన వృద్దులకు పెన్షన్లు ఇస్తున్నారా? లేదా? దానిని రాజకీయ యాక్టివిటిగా ఈనాడు భావిస్తోందా? ఆయా స్కీములకు సంబంధించి ప్రజలకు వివరించి అర్హులైనవారితో దరఖాస్తులు చేయించడం రాజకీయాలలో పాల్గొన్నట్లు అవుతుందా?. ప్రజలను నిరంతరం కలిపి వారి అవసరాలు తెలుసుకుని, సంబంధిత దరఖాస్తులను సచివాలయానికి ఇస్తున్నది నిజం కాదా?.
చదవండి: ఎల్లో బ్యాచ్‌ విష ప్రచారం.. ఘాటుగా స్పందించిన మంత్రి అమర్‌నాథ్‌

పోనీ గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సేవా మిత్రలు ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారా? వారితోనే గెలిచిపోతామని అప్పట్లో టీడీపీ నేతలు భావించేవారా?. కాదా? అయినా ఎందుకు టీడీపీ ఓడిపోయింది. అంతేకాదు.. అన్నదాత సుఖీభవ, పసుపు -కుంకుమ వంటి స్కీములను చివరి నిమిషంలో తీసుకు వచ్చినా టీడీపీకి ఎందుకు ఫలితం దక్కలేదు? జబ్బు ఒకటైతే మందు మరొకటి ఇస్తున్నట్లుగా ప్రస్తుతం ఈనాడు మీడియా కాని, తెలుగుదేశం కాని వ్యవహరిస్తూ తమకు అంటిన ఈర్ష్య వ్యాధిని గుర్తించలేకపోతున్నాయి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాస్తవాల ఆధారంగా విమర్శలు చేయడంలో టీడీపీ విఫలం అవుతుంటే, నిజాలు రాయడానికి సిగ్గుపడే పరిస్థితిలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఉండడం దురదృష్టకరం.
-హితైషి, పొలిటికల్‌ డెస్క్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు