ఎందుకీ వెకిలి రాతలు.. ‘ఈనాడు’ ఎవరి కోసం పనిచేస్తోంది?

6 Jan, 2023 16:46 IST|Sakshi

ఈనాడు దినపత్రిక తన అక్షరాన్ని తెలుగుదేశం పార్టీకి అమ్ముకోవడమో, లేక తాకట్టు పెట్టినట్లో చేసేసినట్టుగా ఉంది. గతంలో విలువలు అంటూ పెద్ద,పెద్ద లెక్చర్లు ఇచ్చిన ఈనాడు అధినేత రామోజీరావు వలువలు వదిలేసి విలువలను మూసినదిలో కలిపేస్తున్నారన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది. రోడ్ షో లు, నడి రోడ్డుపై బహిరంగ సభల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ పై ఈనాడు పత్రికలో వచ్చిన తుగ్లక్ పాలన సంపాదకీయం చదివితే ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది.

ఈ జీవో పై అభ్యంతరం ఉంటే సంపాదకీయం రాయవచ్చు. తప్పుకాదు. రాసిన తీరు చూస్తే, అక్షరక్షంలో విద్వేషం, విషం తప్ప మరొకటి కనిపించదు. ఇలా రోత రాతలను కూడా సంపాదకీయం అని చెప్పుకుంటోందన్నమాట.  తేలుకు పెత్తనమిస్తే తెల్లార్లు కుట్టి చంపిందన్న సామెతను ఈనాడు వాడింది. నిజానికి ఈ సామెత ఆ పత్రికకే వర్తిస్తుంది. తెలుగుదేశం పెత్తనం పోతే, తన పెత్తనం పోయినంతగా లబలబలాడుతూ రోజూ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన ఏడుపుగొట్టు వార్తలు రాస్తూ ఈనాడు ఆత్మవంచన చేసుకుంటోంది.

జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను కాల్చుకు తింటోందట. ఏమి రాశారండి. చెత్త, చెదారం రాసి ప్రజలపై రుద్ది వేధించుకు తింటున్నది ఈనాడు మీడియానే. ఆ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు. పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే రాష్ట్రాన్ని కాల్చుకు తినడమట. పాలనను ప్రజల గడప వద్దకు తీసుకువెళ్లడం కాని, చివరకు వృద్దులకు పెన్షన్లు ఇళ్లకు ఇవ్వడం కాని ఇవేవీ ఈనాడుకు జీర్ణం కావడం లేదు. గతంలో వృద్దులు గంటల తరబడి మండల ఆఫీస్‌ల వద్ద నిలబడి నానా యాతనలు పడితే అది ఈనాడు వారికి స్వర్గంగా కనపడిందన్నమాట.

గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ క్లినిక్‌లు, స్కూళ్లలో నాడు-నేడు, ఇలా ఒకటేమీటి అనేక విప్లవాత్మక మార్పులు తెస్తే హర్షించకపోతే పోనీ, ఇలా దిక్కుమాలిన రాతలు రాస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని ప్రతిపక్షనేతగా జగన్  మొసలి కన్నీరు కార్చారని ఈనాడు ఆరోపించింది. చివరికి కనీస ఇంగితం లేకుండా ఇలాంటి సంపాదకీయం రాశారంటే ఏమనుకోవాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను నడిబజారులో అంగడి సరుకు కొన్నట్లు కొనుగోలు చేస్తే, టీడీపీ పాలన చూసి వారంతా ఎగబడి పార్టీ మారారన్నట్లుగా రాసిన ఈనాడుకు అది ప్రజాస్వామ్యం అనిపించింది.

దానిపై జగన్ చేసిన విమర్శకు, ఇప్పుడు రోడ్డుపై సభలు పెట్టుకోవడంపై నిబంధనలు విధించినదానికి లింక్ పెట్టి రాశారంటే వీరు అజ్ఞానంతో రాశారా? లేక విద్వేషంతో రాశారా? పోలీసులను ఉసికొల్పుతున్నారట. రూల్స్ పాటించమని పోలీసులు చెబితే చంద్రబాబుకే కాదు.. ఈనాడుకు కోపం వస్తోంది. ఎందుకంటే మార్గదర్శి చిట్ ఫండ్స్లోని లొసుగులను ప్రభుత్వ అధికారులు ఎత్తి చూపారన్న దుగ్దతో ఈ పత్రిక ఇలా రాసిందన్న విషయం అర్దం అవుతూనే ఉంది. తాము రాజ్యాంగానికి, చట్టానికి అతీతులం అన్నట్లుగా రామోజీరావు రాతలు ఉన్నాయి.

పోలీసులను అంతు చూస్తానని చంద్రబాబు బెదిరిస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించి, చట్టాన్ని  గౌరవించినట్లు ఈనాడు భాష్యం చెబుతోంది. ఎంత నిస్సిగ్గుగా ఒక విషయం రాశారో చూడండి. కందుకూరు, గుంటూరు విషాద ఘటనలు పోలీసుల వైఫల్యంతో జరిగాయని అన్నారంటే ఇంతకంటే దిగజారుడు తనం ఏమి ఉంటుంది?. కందుకూరులో ఇరుకు రోడ్డులో టీడీపీ సభ పెడితే ఈనాడు కళ్లకు కనబడలేదా?. డ్రోన్‌లతో పెద్ద సభ జరిగినట్లు ప్రజలను మభ్య పెట్టడానికి తెలుగుదేశం చేసిన ప్రయత్నాలను ఈనాడు ఎంత దారుణంగా సమర్దించిందో చూడండి. ఇక గుంటూరులో టోకెన్లు పంచి చంద్రన్న కానుకలు ఇస్తాం రండి అని టీడీపీ సభ నడిపితే ఈనాడుకు గొప్ప విషయం అనిపించింది.

ఎప్పటికప్పుడు శవరాజకీయాలకు వంత పాడుతున్నది ఈనాడు. ఎక్కడైనా ఇద్దరు ఘర్షణపడి మరణిస్తే, అది రాజకీయ ఘర్షణ కాకపోయినా, దానికి రాజకీయ రంగు పులిమి వైసీపీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ బానర్ కథనాలు ఇచ్చిన ఈనాడుకు గుంటూరులో తొక్కిసలాటలో ముగ్గురు మరణిస్తే ఏదో  చిన్న వార్తగా కనిపించింది. కేవలం మొక్కుబడిగా మొదటి పేజీలో ఒక ముక్కపెట్టారు. రహదారి ప్రమాదాలలో ఎవరైనా మరణిస్తున్నారు కనుక, రోడ్లపై సభలు జరిగి జనం చస్తే మాత్రం ఏమిటనే స్థాయికి ఈనాడు పతనం అవుతుందని ఊహించలేకపోయాం.

సరిగ్గా ఇది చంద్రబాబు నాయుడు మాట మాదిరే ఉంది. ఆయన గతంలో పుష్కరాలలో 29 తన సినిమా ప్రచార యావ కారణంగా మరణిస్తే, రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో మృతి చెందడం లేదా అని ప్రశ్నించారు. అప్పట్లో ఈనాడు కూడా పుష్కర మరణాలను కప్పిపుచ్చడానికి  ఎన్ని తంటాలు పడింది అందరికి తెలుసు. పోలీసులు వైసీపీ పెంపుడు మనుషులుగా ఉన్నారంటూ నీచంగా రాసిన ఈనాడుకు గతంలో చంద్రబాబు టైమ్‌లో ప్రతిపక్ష వైసీపీకి పోలీసులు అండగా ఉన్నారా? లేక ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకున్నారా?. ఒక మండల ఎన్నికలో వైసీపీ వారిని అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లేయత్నం చేసిన ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ముస్తాఫాలను రోడ్డు మీదే నిలిపివేసిన సంగతి జనానికి తెలియదని అనుకుంటున్నారు.

ప్రత్యేక హోదాపై ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్ విశాఖ వెళితే విమానం వద్దే నిలిపివేసిన చరిత్ర టీడీపీది కాదా? అప్పుడు పోలీసులు ఎవరి కొమ్ముకాశారు? నంద్యాల ఉప ఎన్నికలో పోలీసులు డబ్బు పంపిణీ చేసినప్పుడు, చివరికి దొంగ ఓట్లు వేయించారన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఈనాడుకు పోలీసులు ప్రజలకు విధేయులుగా కనిపించారని అనుకోవాలి. సామాజిక మాధ్యమాలలో విమర్శిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారట. వారు చేస్తున్నవి విమర్శలా? రాస్తున్నవి బూతులా అన్న విషయంలో తేడా లేకుండా ఈనాడు ప్రస్తావిస్తోందంటే వారు ఎవరి కోసం పనిచేస్తున్నది అర్ధం చేసుకోవచ్చు.

అమరావతి పేరుతో భ్రమరావతి సృష్టించే క్రమంలో ఆ ప్రాంతంలో ఎవరిని నిరసన చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్భంధ కాండ అమలు చేసినప్పుడు, రైతుల పంటలు తగులపెట్టినప్పుడు ఎన్నడైనా ఒక్క వార్త రాశారా? ఒక ఎడిటోరియల్ ప్రజల పక్షాన రాశారా? ఇప్పుడు మాత్రం ఉన్నవి, లేనివి రాసి జగన్‌పై కక్షతో బురద చల్లాలనుకునే ప్రయత్నం అందరికి కనిపిస్తూనే ఉంది. అందుకే జగన్ ఈనాడును దుష్టచతుష్టయంలో భాగంగా చేశారు.

సీఎం కాన్వాయి వెళుతుంటే ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని రాసే ఈ పత్రిక, నడి రోడ్డుపై సభలు పెట్టుకోవడానికి అనుమతించాలని చెప్పడం దారుణం. చంద్రబాబు ,రామోజీరావుల ధైర్యం ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలమన్నదే. పత్రికను అడ్డు పెట్టుకుని ఏమైనా చేయగలమన్నదే వారి ధీమా! పిల్ల ఫాసిస్టు జగన్ రెడ్డి అంటూ రామోజీ రాసిన చండాలపు సంపాదకీయం చదివితే ఈనాడు నగ్నంగా బజారులో నిలబడడానికి కూడా ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అర్ధం అవుతూనే ఉంది.
చదవండి: డేంజర్‌ గేమ్‌.. చంద్రబాబు ప్లాన్‌ అదే..? ఇదిగో రుజువులు..

మహా నియంతలే నేలమట్టం అయ్యారట జగన్‌కు తద్బిన్నంగా భవిష్యత్తు ఉండదట. రామోజీరావు తద్వారా ఉత్తిత్తి పిట్ట మాదిరి శాపనార్దాలు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఈనాడు విలన్‌గా మారింది. తన విలనిజానికి పరాకాష్టగా ఈనాడు వెకిలి రాతలు రాసి ఆత్మానందం పొందుతోంది. జగన్ గెలిస్తే తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని, తన ఎదుట కూర్చుని డిక్టేషన్ తీసుకునే చంద్రబాబు ఓడితే తన ప్రభ మసకబారుతుందన్న బాధ తప్ప మరొకటి కనిపించదు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్షరాన్ని తాకట్టు పెట్టి, ఆంధ్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్న ఈనాడుకు ప్రజలు గుణపాఠం చెప్పకుండా ఉంటారా!
-హితైషి

మరిన్ని వార్తలు