‘ఆయన నా జీవితాన్ని నాశనం చేశారు’

21 Oct, 2020 19:00 IST|Sakshi

బీజేపీని వీడనున్న ఏక్‌నాథ్ ఖడ్సే.. శుక్రవారం ఎన్సీపీలో చేరిక‌

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై బీజేపీ అసంతృప్త నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే మరోసారి ఫైర్‌ అయ్యారు. ఆయన తన జీవితం నాశనం చేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘గత నాలుగేళ్లుగా నేను మానసిక ఆందోళనకు గురవుతున్నా. కేవలం మీ కారణంగానే నాకు ఈ దుస్థితి పట్టింది. పార్టీని వీడటం ఎంతో బాధాకరంగా ఉంది. కానీ నాకు వేరే మార్గం లేదు. లైంగిక దాడి కేసులో నన్ను ఇరికించే ప్రయత్నాలు జరిగాయి. దేవేంద్ర ఫడ్నవిస్‌ నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. పార్టీని వీడే పరిస్థితుల్లోకి నెట్టారు’’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఏక్‌నాథ్‌ ఖడ్సే ఎన్సీపీలో చేరనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. (చదవండి: బీజేపీకి సీనియర్ నేత ఖడ్సే రాంరాం! )

ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్‌, మంత్రి జయంత్‌ పాటిల్‌ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏక్‌నాథ్‌ ఖడ్సే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్సీపీలో చేరనున్నారు. ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుంది’’అని పేర్కొన్నారు. కాగా దేవేంద్ర ఫడ్నవీస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన, ఏక్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతీ సందర్భంలోనూ బీజేపీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్‌ దక్కకుండా ఫడ్నవిస్‌ అడ్డుకున్నారని, కనీసం విధాన పరిషత్‌కు వెళ్లేందుకు కూడా అవకాశమివ్వలేదని మండిపడ్డారు. కాగా ఖడ్సే స్థానంలో ఆయన కుమార్తె రోహిణీ ఖడ్సేకు బీజేపీ టికెట్‌ ఇవ్వగా, ఆమె ఓటమి పాలయ్యారు. 
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు