'మహా' కేబినెట్ విస్తరణ ఆలస్యం అందుకేనా? షిండే బ్యాచ్‌ను కూల్ చేసేందుకు బీజేపీ పక్కా ప్లాన్‌!

29 Jul, 2022 19:17 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి నాలుగు వారాలు దాటింది. కానీ ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అప్పుడు ఇప్పుడు అంటున్నారు తప్ప కేబినెట్‌పై షిండే, బీజేపీ ఎటూ తేల్చడం లేదు. ఆగస్టు 1 తర్వాత కొత్త మంత్రివర్గాన్ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నా.. దానిపైనా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

అయితే కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడానికి షిండే వర్గమే కారణమని బీజేపీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఉద్ధవ్ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ షిండే తన కేబినెట్‌లో చోటు కల్పిస్తారని ఇప్పటికే ఖరారైంది. కానీ షిండే వర్గంలోని ఇతర ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వారిని చల్లబర్చేందుకే కేబినెట్ విస్తరణను ఆలస్యం చేస్తున్నట్లు బీజేపీ నేత ఒకరు చెప్పారు. మంత్రివర్గంపై పార్టీ ఉన్నత స్థాయి నాయకులే చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు మంత్రివర్గ విస్తరణలో గుజరాత్‌ ఫార్ములాను పాటించాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన వారిలో పాతవాళ్లకు కాకుండా మొత్తం కొత్తవారికే కేబినెట్‌లో చోటు కల్పించనున్నట్లు సమాచారం.

కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలోనే షిండే సహా కీలక నేతలు తరచూ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారు. షిండే వర్గం మాత్రం తమకు మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా.. ఆయనకే మద్దతుగా ఉంటామని చెబుతున్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతున్నందునే కేబినెట్ విస్తరణ ఆలస్యం అవుతున్నట్లు పేర్కొన్నారు.

రెండు దఫాలుగా..
అయితే మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ రెండు దఫాలుగా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడతలో 25 మందితో కేబినెట్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు మరికొందరికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపాయి. మొదటి కేబినెట్‌లో తమకు 14 నుంచి 15 బెర్తులు దక్కుతాయని షిండే వర్గం చెబుతోంది.
చదవండి: పదేళ్ల క్రితం చేతిలో రూ.6,300.. ఇప్పుడేమో కోట్లు..

మరిన్ని వార్తలు