-

Eknath Shinde: ‘మహా’ ట్విస్ట్‌; మాట మార్చిన ఏక్‌నాథ్‌ షిండే

24 Jun, 2022 19:24 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతోంది. శివసేన చీలిక వర్గానికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్‌ షిండే మరో ట్విస్ట్‌ ఇచ్చారు. తమతో ఏ జాతీయ పార్టీ సంప్రదింపులు జరపడం లేదని పేర్కొంటూ యూ టర్న్ తీసుకున్నారు. శక్తివంతమైన జాతీయ పార్టీ తమకు సాయం చేస్తోందని చెప్పిన మరుసటి రోజే ఆయన మాట మార్చడం గమనార్హం. 

గురువారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో తన వర్గం ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ.. ‘మనమంతా ఐక్యంగా ఉండాలి. మనం చేసిన తిరుగుబాటును ఓ జాతీయ పార్టీ ప్రశంసించింది. మనకు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని ముందుకు వచ్చింది. ఆ జాతీయ పార్టీ మహాశక్తివంతమైనద’ని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు ఆయన మాట మార్చారు. 


శివసేన చీలిక వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తుందా అన్న ప్రశ్నపై.. ఓ టీవీ చానల్‌తో షిండే శుక్రవారం మాట్లాడుతూ.. ‘ఓ మహాశక్తి మాకు ఇస్తుందని నేను చేసిన వ్యాఖ్యలు బాలాసాహెబ్ ఠాక్రే, ఆనంద్ డిఘేలను ఉ‍ద్దేశించినవ’ని జవాబిచ్చారు. కాగా, మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంతో మతకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. శివసేన పార్టీ అంతర్గత వ్యవహారంలో వేలు పెట్టబోమని తెలిపింది.


బీజేపీ కుటిల యత్నాలు: కాంగ్రెస్‌

ఉద్ధవ్‌ ఠాక్రేను పదవి నుంచి దించేందుకు బీజేపీ కుటిల యత్నాలు చేస్తోందని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఆరోపించారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆయనను గద్దె దించేందుకు బీజేపీ చేయని కుట్రలు లేవు. మహా వికాస్‌ ఆఘాడీ సర్కారు సామాన్యుల విశ్వాసాన్ని చూరగొనడంతో కాషాయ పార్టీ కడుపుమంటతో రగిలిపోతంద’ని తెలిపారు. ఉద్ధవ్‌ ఠాక్రే అనైతికంగా వ్యవహరించారని, అపవిత్ర పొత్తు పెట్టకున్నందుకు ఆయన ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. (క్లిక్‌: ఏక్‌నాథ్‌ షిండే తొలగింపు చెల్లుతుంది!)

మరిన్ని వార్తలు