Priyanka Gandhi Comments: కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక క్లారిటీ.. ‘అసలేం జరిగిందంటే’

22 Jan, 2022 13:33 IST|Sakshi

UP Assembly Election 2022: ఉత్తర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిని తానే అని అర్థం వచ్చేలా ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించడంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ప్రియాంక రాకతో పోటీ రసవత్తరం కానుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ యూత్‌ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె యూపీ సీఎం అభ్యర్థి ఎవరు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘అంతటా నేనే కనిపిస్తున్నా.. మీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా ?. మీరు నన్నే ఎందుకు అనుకోకూడదు’ అని అన్నారు. దీంతో ఆ విషయం హాట్‌ టాపిక్‌ అయింది. 

అయితే, తన వ్యాఖ్యలపట్ల శనివారం ఆమె స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని చెప్పలేదని అన్నారు. విలేకర్లు అదేపనిగా కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నలు గుప్పించడంతో ‘చిరాకు’తో అలా కామెంట్‌ చేశానని పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతూ.. పోటీ గురించి ఇప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 
(చదవండి: కాంగ్రెస్​ హైకమాండ్​పై చన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు)

కాగా, సమాజ్‌వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌.. ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోగా తాజాగా ఆమె ‘యూటర్న్‌’ తీసుకున్నారు. ఇక యూపీలో ప్రధాన పోటీ  బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉండనుందనే విశ్లేషణల నేపథ్యంలో కాంగ్రెస్‌ సీఎం క్యాండిడేట్‌ అంశం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని పొలిటికల్‌ అనలిస్టులు చెప్తున్నారు.
(చదవండి: సమోసా-చాయ్‌ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. ఇవే ధరలు)

మరిన్ని వార్తలు