ఎన్నికల ఫలితాలు: గ్రాండ్‌ విక్టరీ దిశగా బీజేపీ.. అఖిలేష్‌కు దెబ్బ! 70 ఏళ్ల తర్వాత యోగి రికార్డు

10 Mar, 2022 11:58 IST|Sakshi

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలే దాదాపుగా నిజం అవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి ప్రభుత్వ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల  కౌంటింగ్‌లో తొలి రౌండ్‌లోనే మ్యాజిక్‌ ఫిగర్‌ 202ను దాటేసి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రాంతీయ పార్టీలతో జత కలిసి కూటమిగా వెళ్లినా.. అఖిలేష్‌ యాదవ్‌కు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎంఐఎంలకు భంగపాటు తప్పలేదు.

ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కంటిన్యూ అవుతోంది. మోదీ-షా ప్రచార మాయజాలంతో యోగి సర్కార్‌కే రెండోసారి పట్టం కట్టేందుకు జనాలు మొగ్గు చూపించారు. ఫలితాల సరళిని గమనిస్తే.. మెజారిటీ స్థానాలు బీజేపీ సునాయాసంగా గెలుచుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానాలు కొద్దిగా తగ్గినప్పటికీ.. యోగి నేతృత్వంలో సుస్థిర బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం అయ్యింది. 

ముఖ్యంగా యూపీలో బీజేపీకి సోషల్‌ ఇంజినీరింగ్‌ బాగా కలిసొచ్చింది. ముజఫర్‌నగర్‌ పంచాయితీ ఎన్నికల్లో ఫలితం చూపించడంతో.. అసెంబ్లీ ఎన్నికలకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యింది బీజేపీ. Social Engineering కాస్త సూపర్‌సక్సెస్‌ అయ్యింది. ఓబీసీలు యోగి సర్కార్‌ వెంటే నడిచారు. అఖిలేష్‌ నేతృత్వంలోని ఎస్పీ కూటమి.. రెండో ప్లేస్‌లో నిలిచింది. అయితే చాలాగ్యాప్‌ తర్వాత ఎస్పీ వంద సీట్లు దాటడం కాస్త ఊరట ఇచ్చే విషయం. ఎంఐఎం ఓటింగ్‌ శాతం.. ఎస్పీపై ప్రభావం చూపిందని విశ్లేషకుల అంచనా. గతంలో ప్రతిపక్షం ఎప్పుడూ 50 సీట్ల కంటే ఎక్కువ గెలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇక నాలుగుసార్లు యూపీని పాలించిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ.. కనీస ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్‌ కీలక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినప్పటికీ.. ఫలితాల్లో మాత్రం పరిస్థితి ఘోరంగా కనిపిస్తోంది. 

ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ స్థానంలో గెలుపుదిశగా పయనిస్తున్నారు. యూపీలో 70 ఏళ్ల తర్వాత రికార్డు బద్ధలు అయ్యేలా కనిపిస్తోంది. స్వాతంత్రం వచ్చాక యూపీకి ఒక సీఎం పూర్తిస్థాయి పదవి కాలం పూర్తి చేసుకున్నాక.. రెండోసారి ఎన్నిక కావడం ఇదే తొలిసారి కానుంది. అంతేకాదు దాదాపు 37 ఏళ్ల తర్వాత ఒక పెద్ద రాష్ట్రంలో.. బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం కూడా జరగనుంది.

మరిన్ని వార్తలు