ఉద్దవ్ థాక్రే వర్గానికి ఈసీ డెడ్‌లైన్.. స్పందించకపోతే షిండే వర్గానికే విల్లు-బాణం!

7 Oct, 2022 21:31 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: శివసేన ఎన్నికల గుర్తు కేటాయింపుపై ఉద్ధవ్ థాక్రే వర్గానికి డెడ్‌లైన్ విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. శనివారం మధ్యాహ్నం 2గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అసలైన శివసేన తమదే అని, తూర్పు అంధేరీ ఉపఎన్నికలో విల్లు-బాణం గుర్తు తమకే కేటాయించాలని ఏక్‌నాథ్‌ షిండే వర్గం ఈసీని కోరిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల సంఘం ఇచ్చిన గడవులోగా తప్పకుండా వివరణ ఇస్తామని థాక్రే వర్గం స్పష్టం చేసింది. ఇప్పటికే శుక్రవారం ఈసీ అధికారులను కలిసి శివసేన పార్టీని షిండే వర్గం వారే స్వచ్ఛందంగా విడిచివెళ్లారని, కాబట్టి వారికి విల్లు-బాణం గుర్తు ఇవ్వొద్దని కోరింది. కానీ షిండే వర్గం శివసేన తమదే అని ఈసీకి శుక్రవారం రోజే చెప్పడంతో అధికారులు థాక్రే వర్గాన్ని మరోమారు వివరణ కోరారు. శనివారం మధ్యాహ్నం 2గంటల్లోగా స్పందించకపోతే నిబంధనల ప్రకారం గుర్తు ఎవరికి దక్కితే వారికే కేటాయిస్తామన్నారు.

అంధేరి ఉపఎన్నికలో శివసేన(థాక్రే వర్గం) అభ్యర్థిగా రుతుజా లట్కే బరిలోకి దిగుతున్నారు. ఆమె భర్త రమేశ్ లట్కే మృతితో ఈ ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా మున్సిపల్ కార్పోరేటర్ ముర్జి పటేల్ పోటీ చేస్తున్నారు. షిండే వర్గం ఈయనకు మద్దతు తెలుపుతోంది. మిహావికాస్ అఘాడీ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలు రుతుజా లట్కేకే మద్దతుగా ఉంటున్నాయి.
చదవండి: శివసేన గుర్తు వాళ్లదెలా అవుతుంది: ఉద్ధవ్ థాక్రే

మరిన్ని వార్తలు