మమతకు ఈసీ నోటీసు

8 Apr, 2021 02:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం బుధవారం నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు 48 గంట ల్లోగా స్పందించాలని ఆదేశించింది. హూగ్లీ జిల్లాలో ని తారకేశ్వర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగిస్తూ.. ముస్లింలంతా టీఎంసీకే ఓటేయాలని, వేర్వేరు పార్టీలకు వేసి ఓట్లను చీల్చవద్దని కోరారు. దీనిపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దాంతో, ఆ వ్యాఖ్యలు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈసీ మమతకు నోటీసు జారీ చేసింది.

‘మైనారిటీల కోసం ఐక్యశ్రీ పథకం ప్రారంభించాం. 2.35 లక్షల మంది మైనారిటీలకు లబ్ధి చేకూర్చాం. మైనారిటీ సోదర, సోదరీమణులకు చేతులెత్తి ప్రార్థిస్తున్నా. మైనారిటీ ఓట్లను చీల్చకండి. బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న ఆ సైతాను మాటలను నమ్మకండి. అతడు హిందూ, ముస్లిం ఘర్షణలు చెలరేగాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎన్నో చేస్తుంటాడు. బీజేపీ రహస్య మిత్రుల్లో అతడు ఒకడు. ఇటు సీపీఎం, బీజేపీ నేతలు మైనారిటీ ఓట్లను చీల్చేందుకు బీజేపీ ఇచ్చిన డబ్బులు పంచుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మీరు పెద్ద ప్రమాదంలో పడ్తారు. నా హిందూ కుటుంబ సభ్యులను  అభ్యర్థిస్తున్నా. బీజేపీ మాటలు విని హిందూ, ముస్లింలుగా మీరు విడిపోవద్దు’ అని మమత ప్రసంగించారని బీజేపీ పేర్కొంది. 

మరిన్ని వార్తలు