బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి షాక్‌.. ఈసీ సీరియస్‌

29 Nov, 2023 11:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు రేపు(గురువారం) పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. మరోవైపు.. మంగళవారం సాయంత్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక. ఓట్ల అభ్యర్థులు తీవ్ర ప్రయత్నలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అయితే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. కౌశిక్‌రెడ్డి తన వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఇక, నిన్న హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ఎమోషనల్ వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి. 

హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో చివరి రోజు తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ..‘మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నాకు ఓటేసి నన్ను గెలిపించండి.. నేను చేయాల్సిన ప్రచారం చేసిన.. ఇక సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం.. నన్ను, నా భార్య, నా బిడ్డను సాదుకుంటారో.. ఓడించి ఉరేసుకొమ్మంటారో మీ చేతుల్లోనే ఉంది. ఓట్లేసి గెలిపిస్తే విజయ యాత్రకు నేను వస్తా.. లేకపోతే డిసెంబర్ నాలుగో తారీఖు నాడు నా శవయాత్రకు మీరు రండి’ అంటూ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో, ఆయన వ్యాఖ్యలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు. కౌశిక్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా.. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు