‘స్థానిక’ ఖాళీలపై ఎన్నికల కమిషన్‌ కదలిక

26 Mar, 2023 03:21 IST|Sakshi

హైకోర్టు నోటీస్‌ నేపథ్యంలో సర్కార్‌ అనుమతి కోరనున్న ఎస్‌ఈసీ 

రాష్ట్రవ్యాప్తంగా ఆరువేలకుపైగా పోస్టులు రెండేళ్లుగా ఖాళీ

సాక్షి, హైదరాబాద్‌: వివిధ స్థానిక సంస్థల్లో ఖాళీలు ఏర్పడిన పలు ప్రజాప్రతినిధుల స్థానాల ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్టు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ) వర్గాలు వెల్లడించాయి. పలు సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుసభ్యులు, ఇతర పోస్టులకు ఎన్నికలెందుకు నిర్వహించడం లేదంటూ తాజాగా ఎస్‌ఈసీకి, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికలు ఎన్ని రోజుల్లోగా నిర్వహిస్తారో వెల్లడించాలని, అందుకు నెల రోజుల సమయం కూడా కోర్టు ఇచ్చిన నేప థ్యంలో ప్రభుత్వానికి ఎస్‌ఈసీ విజ్ఞప్తి చేయను న్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు కోర్టు నోటీస్‌ జారీకి సంబంధించిన ఆర్డర్‌ కాపీ ఎస్‌ఈసీకి, పీఆర్‌ శాఖకు చేరేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ లోగా ఖాళీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి.

పీఆర్‌ శాఖ కమిషనర్‌కు కూడా కోర్టు నోటీస్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆయా అంశాల ప్రాతిపదికన సమా« దానం పంపేందుకు సిద్ధమ వుతున్నట్టు తెలుస్తోంది. నూతన పీఆర్‌ చట్టం ప్రకారం... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలకు సంబంధించి ప్రభుత్వ సమ్మతి, ఆమోదంపొందాకే ఎస్‌ఈసీ వాటిని ఖరారు చేయాల్సి ఉంటుందనే నిబంధన విధించారు.

వివిధ గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం 2024 జనవరిలో ముగియనుంది. ఖాళీలు ఏర్పడిన స్థానాలకు ఇంకా 9 నెలల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏదైనా కారణంతో స్థానిక సంస్థల పోస్టులు ఖాళీ అయితే ఆరునెలల్లో భర్తీ చేయాల్సి ఉండగా, వీటి ఎన్నిక మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. 

మినీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత
వివిధ గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రజా ప్రతినిధుల పోస్టులు ఆరువేలకుపైగా ఖాళీలు ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా వాటికి ఎన్నికలు నిర్వహించకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరణంలో ఈ ‘మినీ పంచాయతీ’ఎన్నికలు జరుగుతాయో, లేదోననే చర్చ ఆసక్తికరంగా మారింది.

గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాక ఎన్నికల వ్యయం వెల్లడించకపోవడం, విధుల నిర్వహణలో అలస త్వం ప్రదర్శించడం, అక్రమాలు, పీఆర్‌ చట్ట ఉల్లంఘనకు పాల్పడటం వంటి కారణాలతో కొన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యులు, మున్సిపల్‌ వార్డు సభ్యుల పోస్టులు ఖాళీ అయ్యా యి.

వీటికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది భాస్కర్‌ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఎస్‌ఈసీకి, పీఆర్‌ కమిషనర్‌లకు తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు