ఆదిలాబాద్‌: అప్పుడే మొదలైన ఎన్నికల పోరు..

7 Aug, 2022 13:08 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల పోరు‌ మొదలైంది. ఎమ్మెల్యే రామన్న ఇక్కడినుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. ఐదోసారి పోటీచేసి విజయం సాధించాలనుకుంటున్నారు. మరోసారి మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. ఎమ్మెల్యే రామన్న కొంతకాలంగా ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరిపిస్తున్నారు. తెలంగాణ తొలి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రామన్న.. నియోజకవర్గంలో ‌మారుమూల ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం కల్పించారు. పట్టణంలో సుందరీకరణ సహా అభివృద్ధి పనులు చేపట్టారు.

పట్టణాన్ని అభివృద్ధి చేసినా.. కొన్ని పనులు జరగకపోవడం రామన్నకు మైనస్‌గా చెబుతున్నారు. పార్టీ నాయకుల భూ కబ్జాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా  మారాయంటున్నారు. దీనికి తోడు.. డైరీ కార్పొరేషన్ చైర్మన్ లోకభూమారెడ్డి మరికొందరు రామన్నకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అయితే మున్నూరు కాపులే నియోజకవర్గంలో‌ గెలుపు ఓటములను నిర్ణయించే సామాజికవర్గం.  ఎవరు ఎన్ని కుట్రలు చేసిన టిక్కెట్ తనకే దక్కుతుందని రామన్న భావిస్తున్నారట.

ఇక రామన్నను ఓడిస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ నాయకుడు పాయల శంకర్. రామన్నను ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యూహాలను రచించినప్పటికీ ఆయన చేతిలో పాయల శంకర్ రెండుసార్లు ఓటమి చెందారు. ఈసారి బీజేపీలో టిక్కెట్ పోరు తారాస్థాయికి చేరింది. పాయల్ శంకర్‌కు టిక్కెట్ ఇవ్వవద్దని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుహసిని రెడ్డి, ఎన్అర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారట. ఈ ఇద్దరు తమకే టిక్కెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. దీనితో బీజేపీలో టిక్కెట్ పోరు అసక్తికరంగా‌  మారింది.
చదవండి: మునుగోడులో సర్వేల జోరు.. ఎవరైతే బెటర్‌!

కాంగ్రెస్ జిల్లా ఇంచార్జ్ అధ్యక్షుడు షాజిద్ ఖాన్ తానే పార్టీ అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిన గండ్రత్ సుజాత మళ్లీ పోటీకి సై అంటున్నారు. అయితే ఈ ఇద్దరికీ టీఆర్ఎస్, బీజేపీలను ఓడించే సత్తా లేదని భావించి మరో సమర్థుడైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ నాయకత్వం వెతుకుతోందని తెలుస్తోంది.

షెడ్యూల్డు తెగలకు రిజర్వైన బోథ్ నుంచి రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ తరపున రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి కూడా పోటీ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని బాపురావు మీద ప్రజలకు తీవ్ర అసంతృప్తిగా ఉంది. అత్యంత మారుమూల ప్రాంతమైన బోథ్‌లోని అనేక గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు.

వెంటనే నిర్మాణపనులు ప్రారంభిస్తామన్న కుఫ్టీ ప్రాజెక్టు ఇంకా కాగితాలకే పరిమితమైంది. ఎమ్మెల్యే అసమర్థత వల్లనే స్థానిక సంస్థల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. బాపురావు గ్రామాల్లోకి వెళితే అడ్డుకుంటూ తమ వ్యతిరేకతను ప్రజలు తెలియచేస్తున్నారు. పైగా సర్వేల్లో కూడా బోథ్ ఎమ్మెల్యే బాగా వెనుకబడినట్లు సమాచారం.

నియోజకవర్గంలో ఇంతటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న రాథోడ్‌ బాపురావుకు వచ్చేసారి టిక్కెట్ రాదని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ సోయం బాపురావు గనుక కమలం పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే.. టీఆర్ఎస్‌ బాస్‌ ఇక్కడి ఎమ్మెల్యే టిక్కెట్‌ తనకే ఇస్తారని మాజీ ఎంపీ నగేష్‌ అంటున్నారు. పార్టీలో తనకు పోటీ పెరగడం, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో బాపురావు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ తరపున ఎంపీ సోయం బాపూరావు బరిలోకి దిగడం ఖాయం అంటున్నారు.

పార్టీ నాయకత్వం కూడా సోయంకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే...తాను ఎమ్మెల్యేగా నెగ్గితే మంత్రి పదవి ఖాయమని సోయం భావిస్తున్నారు. సోయంకు లోక్‌సభ ఎన్నికల్లో ఆదివాసీలు అండగా నిలిచారు. అందుకే ఆయన ఎంపీ అయ్యారు. ఎంపీ కాగానే తుండదెబ్బ బాధ్యతల నుంచి తప్పుకున్నారు సోయం బాపురావు. దీంతో ఆయనకు ఆదివాసీలు వ్యతిరేకంగా మారారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌కు బోథ్‌లో అభ్యర్థే కనిపించడంలేదు. టీఆర్ఎస్‌లో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న ఎంపీటీసీ అనిల్ జాదవ్‌...అక్కడ ఫలితం లేకపోతే కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తారని ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు