హుజూరాబాద్‌ జోష్‌; బీజేపీలో విందు రాజకీయాలు 

14 Nov, 2021 12:01 IST|Sakshi

హుజూరాబాద్‌ ఉపఎన్నిక గెలుపుతో పార్టీ నేతల్లో జోరు

నిరసనలు, ఆందోళనలతో అలిసిపోయిన నేతలు

డీకే అరుణ విందు.. పాల్గొన్న బండి సంజయ్, పార్టీ నేతలు

ఇదే బాటలో మరికొందరి ముఖ్యనేతల విందు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీలో నేతల విందు రాజకీయాలు జోరందుకుంటున్నాయి. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపుతో జోరు మీదున్న నాయకులు తమ పార్టీలోని నాయకులతో కలిసి విందులు చేసుకుంటున్నారు. కొన్ని నెలలుగా అలుపెరగకుండా వివిధ కార్యక్రవలు, ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్న వారు సేదతీరే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక, ధాన్యం కొనుగోళ్లు, దళితబంధు అమలు, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పోటాపోటీ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, శ్రేణులు నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈనెల 16న నిరుద్యోగ మిలియన్‌ మార్చ్, 21 నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను మొదలుపెట్టాలని భావించారు.

అయితే శాసనమండలిలో స్థానికసంస్థల ప్రతినిధులు, తదితర సీట్లకు ఏర్పడనున్న ఖాళీల భర్తీకి ఈసీ ఎన్నికల షెడ్యల్‌ విడుదలతో ఈ కార్యక్రమాల నిర్వహణపై పార్టీ పునరాలోచనలో పడింది. ఇదిలా ఉండగా శనివారం రాత్రి నగర శివార్లలోని తమ వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విందునిచ్చారు. ఈ విందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యులు, రాష్ట్ర పార్టీ పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు హాజరయ్యారు. నాయకులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

వీరి బాటలోనే మరికొందరు ముఖ్యనేతలు కూడా విందులిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సవచారం. ఇదిలా ఉంటే.. బీజేపీలో ముఖ్యనేతల మధ్య ఏర్పడిన అంతరాలు, అసంతృప్తులను దూరం చేసుకునేందుకు ఒక రహస్య ప్రదేశంలో శనివారం సమావేశమవుతున్నట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరగడం విందు రాజకీయాలకు కొసమెరుపుగా చెప్పొచ్చు.

ముఖ్యనేతల మధ్య ఏదైనా రహస్యభేటీ ఉంటే పరిమితంగా ఐదారు మంది కలుసుకుంటారే తప్ప రాష్ట్ర పార్టీ నాయకులంతా ఒక చోట చేరరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలంటూ ఓ బీజేపీ నేత ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. అయితే శనివారం ఒక ముఖ్య నేత ఇంట్లో జరిగిన సమావేశానికి రాష్ట్ర నేతలు హాజరైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో కొందరు నాయకుల మధ్య ఏర్పడిన అంతరాలు, అసంతృప్తులపై చర్చించారని కొందరు చెబుతున్నా అది ధ్రువీకరణ కాలేదు.   

మరిన్ని వార్తలు